తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగిన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగిన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమాన నేత కేసీఆర్‌కు గులాబీ శ్రేణులు, అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తాయి. కేక్‌ కటింగ్‌లు, హరితహారం, రక్తధాన శిబిరాలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించారు. ఈచ్‌ వన్‌.. ప్లాంట్‌ వన్‌ నినాదంతో.. మొక్కలు నాటారు...

కేసీఆర్‌కు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని,, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే సీఎం కేసీఆర్‌ శతవసంతాలు జరుపుకోవాలని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఉన్నతాధికారులు కలిశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది.. సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు..

సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లక్షా10 వేల మొక్కలు నాటినట్టు తెలిపారు మంత్రి హరీష్‌. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం కన్నా వాటిని సంరక్షించడం గొప్ప పని అన్నారు మంత్రి హరీష్‌.

హైద్రాబాద్‌ జలవిహార్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సంతోష్‌ కుమార్‌.. మొక్కలు నాటారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కేశవరావుతో పాటు పలువురు నేతలు కేక్‌ కట్‌ చేశారు.

కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. తెలంగాణ భవన్‌లో మొక్కలు నాటిన టీఆర్‌ఎస్‌ నేతలు.. పేదలకు బట్టలు పంపిణీ చేశారు...

మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఘనంగా నిర్వహించారు. పద్మావతి కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటి హరితహారం చేపట్టారు. అనాథ పిల్లల మధ్య కేక్‌ కట్ చేసి... పండ్లు, బియ్యం, స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేశారు.

సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. తన క్యాంప్‌ కార్యాలయంలో కేట్‌కట్‌ చేసారు. అనంతరం రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. టేకుమట్ల,మూసీ రహదారిలో 6600 మొక్కలు నాటారు.

సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా.. లోకాయుక్త జస్టీస్‌ సీవీ రాములు, ఉపలోకాయుక్త నిరంజన్‌ రావు హరితహారంలో పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌ లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం కాలుష్యనియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు లోకాయుక్త జస్టీస్‌ సీవీ రాములు.

Tags

Next Story