భారత ఆర్మీలోనూ ‘ఆమె’కు అందలం..

ఆమె కమాండ్ చేయగలదు... శారీరక లక్షణాలు ఆమె ప్రతిభ-సామర్థ్యాలకు అడ్డంకి కాదు... సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట ఇది. సైన్యం లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదాపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. వుమెన్ ఆఫీ సర్లకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాల్సిందేనని అత్యున్నత న్యాయస్థా నం స్పష్టం చేసింది. సర్వీసులో ఎంతకా లం ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ హోదా వర్తిస్తుందని పేర్కొంది. 3 నెలల్లోగా శాశ్వత కమిషన్ హోదా మంజూరు చేయాలని ఆదేశించింది. స్త్రీల సామర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనాధోరణి మార్చుకోవాలని హితవు పలికింది. అతివల హక్కులకు, శారీరక లక్షణాలతో ముడి పెట్టండ సమంజసం కాదని స్పష్టం చేసింది. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది.
భారత ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్మీలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన జవాన్లు ఉన్నారని, కమాండ్ హోదాలో మహిళా అధికారులను అంగీకరించడానికి వారు మానసికంగా సిద్ధంగా లేరని కేంద్రం పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం నివేదికపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయుధ బలగాల్లో లింగ వివక్షను తొలగించాలంటే ప్రభుత్వఆలోచనా ధోరణి మారాలని స్పష్టం చేసింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిషేధించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇది సమానత్వ హక్కులకు వ్యతిరేకమని అభిప్రా యపడింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్రం వాదనను తోసి పుచ్చిన ధర్మాసనం, స్త్రీలు ఇంటి పనులకు మాత్రమే పరిమితమనే ఆలోచనా ధోరణి మారాలని హితవు పలికింది. సుప్రీంకోర్టు తీర్పుపై మహిళా జవాన్లు హర్షం వ్యక్తం చేశారు. సైన్యంలోనూ తాము సత్తా చాటగలమని, దళాలను కమాండ్ చేయగలమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు స్వాగతించాయి. కాలానుగుణంగా సైన్యంలోనూ మార్పులు రావాలని సూచిం చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com