ఏపీలో తుగ్లక్ పాలనకు ముగింపు పలకాలి : నారా లోకేష్

ఏపీలో తుగ్లక్ పాలనకు ముగింపు పలకాలి అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ నియంత పాలనకు ముగింపు పలికేందుకు పార్టీ చేపట్టే ప్రజా చైతన్య యాత్రలు నాంది కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. మొదట కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్.. పింఛన్లలో కోత, నిరుద్యోగభృతి ఎత్తివేత వంటి ప్రజా వ్యతిరేక విధానాలను గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని 63 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
తుగ్లక్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపొందాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలంతా యుద్ధంలో సైనికుల్లా పని చేయాలని పిలుపు ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. గెలిచే నియోజకవర్గంలో పోటీ చేయడం కంటే.. పార్టీ బలహీనంగా ఉన్న చోటే పోటీ చేయడం గొప్ప అని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగానని గుర్తు చేశారు..
తరువాత గుంటూరు జిల్లాలోని కృష్ణాయపాలెంలో రైతుల దీక్షా స్థలానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు లోకేష్. 60 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన నలుగురు రైతులకు నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com