ట్రంప్ టూర్‌పై ప్రాంతీయ ముద్ర పడకుండా చర్యలు..

ట్రంప్ టూర్‌పై ప్రాంతీయ ముద్ర పడకుండా చర్యలు..

అగ్రరాజ్యాధినేత పర్యటన విషయంలో మోదీ సర్కారు సకల జాగ్రత్తలు తీసుకుంటోంది. భద్రత, ఆతిథ్యం పరంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్న కేంద్రం, తాజాగా ట్రంప్ టూర్‌పై ప్రాంతీయ ముద్ర పడకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అహ్మదాబాద్‌లో ట్రంప్ మీటింగ్‌ పేరును మార్చేసింది. కెమ్ ఛో ట్రంప్‌ పేరును నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్‌గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24న అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ట్రంప్-మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్‌కు కెమ్‌ ఛో ట్రంప్ అని పేరు పెట్టారు. కెమ్ ఛో అనేది గుజరాతీ పదం. ఐతే, విదేశీ నాయకుని సభకు ప్రాంతీయ పేరు పెట్టడం సరికాదనే వాదనలు వినిపించాయి. భారతీయత-జాతీయ భావాన్ని మిళితం చేసేలా పేరు పెడితే బాగుంటుందని సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతటికీ భారతీ య పలకరింపుగా సుపరిచితమైన నమస్తే పదాన్ని ఫైనల్ చేశారు. నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్ పేరుతో అహ్మదాబాద్ సభను నిర్వహించనున్నారు.

రెండు రోజుల పర్యటనలో ప్రపంచవింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను ట్రంప్ సందర్శించనున్నారు. ఈనెల 24న ఆయన ఆగ్రాకు వెళ్లనున్నారు. సతీసమేతంగా తాజ్‌మహల్ అందాలను వీక్షించనున్నారు. ఈ మేరకు ఆగ్రా అధికారులకు సమాచారం వచ్చింది. దాంతో ఆగ్రా పరిసరాలను అందంగా తీర్చి దిద్దుతున్నారు. తాజ్‌మహల్ పరిసరాల్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టారు. రహదారులు, డివైడర్లను ముస్తా బు చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో ముస్తాబు చేస్తున్నారు.

ట్రంప్ పర్యటనపై మోదీ సర్కారు తీరును శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. ట్రంప్‌ భారత పర్యటన బాద్షా ను మరిపిస్తోందని ఎద్దేవా చేసింది. ట్రంప్‌ పర్యటనకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు బానిస మన స్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మండిపడింది. ట్రంప్‌ ప్రయాణించే మార్గంలో గుడిసెలు కనిపించకుండా గోడను నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ నినాదం గరీబీ చుపావ్‌లా ఉందని చురకలు వేసింది. ట్రంప్‌ పర్యటన పడిపోతున్న రూపాయిని కాపాడలేదని, పేదలను ఉద్ధరించదని స్పష్టం చేసింది. అమెరికాలో అత్యధికంగా ఉన్న గుజరాతీ ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడల్లో భాగంగానే అహ్మదా బాద్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని దుయ్యబట్టింది.

Tags

Next Story