ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన యువతి

ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన యువతి

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో దారుణం చోటు చేసుకుంది.. ఓ ప్రేమోన్మాది యువతిని అతి దారుణంగా హత్య చేశాడు.. వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ప్రేమోన్మాది దాడిలో మృతిచెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.. గజ్వేల్‌లోనే రూమ్‌ తీసుకుని ఉంటోంది.. నిన్న బ్యాంకుకు వెళ్లిన దివ్య.. సాయంత్రం యథావిథిగా పనులు ముగించుకుని రూమ్‌కు వెళ్లింది.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటూ స్థానికులకు కనిపించింది..

కాబోయే భర్తతో ఫోన్‌ మాట్లాడుతూ మెట్లు దిగుతున్న దివ్యపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు.. కత్తితో ఆమె గొంతు కోశాడు.. ఊహించని ఘటనతో ఆమె కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలింది.. ఆమె కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా రక్తపు మడుగులో దివ్య పడిఉంది.. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పెళ్లిపీటలెక్కాల్సిన తమ బిడ్డ హత్యకు గురైందన్న సమాచారం తెలుసుకుని దివ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేములవాడకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. దివ్య హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో తమ బిడ్డతో వెంకటేష్‌కు పరిచయం ఉందని చెబుతున్నారు.. కొన్నాళ్లుగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడని వారంటున్నారు.. ఈ నేపథ్యంలో అతనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో దివ్య జోలికి రానని కాగితం రాసిచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ పగను మనసులో పెట్టుకునే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇక యువతి ఉంటున్న ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు.. నిందితుడి కదలికలను ఆరా తీస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ఆధారాలు లభించాయని, త్వరలోనే నిందితుణ్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story