పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ఆచూకీ తెలిసిపోయింది

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ఆచూకీ తెలిసిపోయింది

గుట్టు బయటపడింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ ఆచూకీ తెలిసిపోయింది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మౌలానా మసూద్ అజర్ ఎక్కడున్నాడో నిఘా వర్గాలు కనిపెట్టేశాయి. పాకిస్థాన్‌లోనే మసూద్ అజర్ దాక్కున్నాడు. బాంబ్ ప్రూఫ్‌ ఇంట్లో భద్రంగా తలదాచుకున్నాడు. భావల్పూర్‌లోని జైషే సెంట్రల్ ఆఫీస్ వెనక మసూద్ అజర్ బస చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. మసూద్‌ అజర్‌ మొత్తం మూడు చిరునామాల్లో ఉంటున్నాడు. భావల్పూర్‌లోని కౌసర్‌ కాలనీ, ఖైబర్ పంక్తుక్వాలోని బిలాల్ హబ్షి మదర్సా, లక్కి మార్వాట్‌ ఏరియాలోని ఎలుక్మాన్ మదర్సాలలో మసూద్ తలదాచుకుంటున్నాడు. నిఘా కన్ను నుంచి తప్పించుకోవడానికి, శత్రువుల దాడి నుంచి రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు మకం మారుస్తున్నాడు.

మసూద్ ఆచూకీతో పాటు అతనికి సంబంధించిన కీలక సమాచారం భారత నిఘావర్గాలకు చిక్కింది. పుల్వామా దాడి తర్వాత మసూద్ అజార్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు భద్రతా బలగాలు కొన్ని మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషించగా, ఆ మొబైల్ నంబర్లలో ఒకటి నేరుగా భావల్పూర్ ఉగ్రవాద కేంద్రంతో లింక్‌ చేశారని బయటపడింది.

భావల్పూర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలపాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచే ముఖ్యమైన ఆపరేషన్లు జరుగుతాయి. ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సేకరణ అంతా ఇక్కడే జరుగుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ముజఫరాబాద్, చకోటీ, బాలాకోట్‌లలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఆ దాడుల్లో వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్ట్ క్యాంపులు నేలమట్టమయ్యాయి. ఆ నేపథ్యంలో అక్కడ కొంతకాలం పాటు ఉగ్రవాద కార్యకలాపాలు స్తంభించాయి. కానీ, గత ఏడాది సెప్టెంబర్ నుంచి మళ్లీ ఉగ్రవాద కార్యక్రమాలు ప్రారంభమయ్యా యి. స్వయంగా మసూద్ అజర్ పర్యవేక్షణలోనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతంపై ఐబీ వర్గాలు నిఘా పెట్టాయి. చివరికి మసూద్ ఆచూకీని కనిపెట్టాయి.

మసూద్‌ అజర్‌కు మనదేశమంటే భయంకరమైన కోపం. మనదేశంలో మారణహోమం సృష్టించాలన్నదే అతని ఆశయం. పుల్వామా ఉగ్రదాడి, భారత పార్లమెంట్‌పై దాడి సహా ఎన్నో కుట్రల్లో అతని ప్రమేయముంది. మసూద్ కోసం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఎన్నోసార్లు విజ్ఞప్తులు పంపించింది. ఆధారాలు కూడా చూపించింది. కానీ, పాకిస్థాన్ సర్కా ర్‌ ఎప్పటికప్పుడు మసూద్‌ను రక్షిస్తూ వచ్చింది. తాజాగా మసూద్ అజర్ అదృశ్యమయ్యాడని, అతను కనిపించడం లేదంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఐతే పాక్ కపటబుద్దిని నిఘా వర్గాలు ఇట్టే పసిగట్టాయి. నిత్యం అప్రమత్తంగా ఉంటున్న నిఘా సంస్థలు మసూద్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశాయి.

Tags

Read MoreRead Less
Next Story