ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారిన టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ ఎంపిక

ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారిన టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ ఎంపిక

స్పిన్నరా..? పేసరా..? టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఎవ్వరికి అవకాశం దక్కుతుంది..? టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఫైనల్ ఇంటర్వ్యూకు నలుగురు మాజీ ఆటగాళ్లు మిగిలారు. మాజీ పేస్ బౌలర్లు వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మరో స్నిన్నర్ రాజేష్ చౌహాన్‌లు చీఫ్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. ఈ నలుగురు ఫైనల్ రౌండ్‌లో పోటీ పడుతున్నారు. విచిత్రమేంటంటే ఈ నలుగురూ కూడా బౌలర్లే కావడం గమనార్హం. అంటే ఈ నలుగురిలో ఎవరు ఎన్నికైనా టీమిండియాను నడిపించబోయేది ఓ బౌలరే అన్నమాట.

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగిసింది. దాంతో కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను క్రికెట్ పాలక మండలి-సీఏసీకి అప్పగించారు. సీఏసీలో మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ్‌ నాయక్‌లు ఉన్నారు. ఈ ముగ్గురు సభ్యుల బృందం సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఇంటర్వ్యూ చేసింది. రౌండ్ల వారీగా ఇంటర్వ్యూ తర్వాత వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్‌లు చివరి రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ నలుగురిలో ఎవరికి చీఫ్ సెలెక్టర్ పోస్ట్ దక్కుతుందన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.

అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నాడు. ఈ లెక్కన అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్ మధ్య పోటీ ఉండవచ్చు. టెస్టుల పరంగా వెంకటేశ్ ప్రసాద్‌కు, వన్డేల పరంగా అజిత్ అగార్కర్‌కు ఎక్కువ అనుభవం ఉంది. వెంకటేశ్ ప్రసాద్ 33 టెస్టులు ఆడితే, అగార్కర్ 26 టెస్టులు ఆడాడు. వన్డేల్లో వెంకటేశ్‌ ప్రసాద్‌ 161 మ్యాచ్‌లు ఆడితే, అగార్కర్‌ 191 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా, అగార్కర్‌ 4 అంతర్జాతీయ టీ20లు కూడా ఆడాడు. మొత్తంగా చూస్తే వెంకటేశ్ ప్రసాద్‌ కంటే అగార్కర్‌కు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. పైగా బీసీసీఐ చీఫ్ గంగూలీతో అగార్కర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. ఈ లెక్కన చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌ అగార్కర్‌కే లభిస్తుందని చెబుతున్నారు. వెంకటేశ్ ప్రసాద్‌ సీనియార్టీని గుర్తించి అతన్ని సెలెక్టర్‌గా ఎంపిక చేస్తారని సమాచారం.

ఒకవేళ అగార్కర్‌ను చీఫ్ సెలక్టర్‌గానో, సెలెక్టర్‌గానో తీసుకుంటే వెస్ట్ జోన్ నుంచి ఇద్దరికి ప్యానెల్‌లో చోటు లభించినట్టు అవుతుంది. జతిన్ పరాంజపే ఇప్పటికే ప్యానెల్‌లో ఉన్నాడు. అగార్కర్‌కు బెర్త్ ఖాయమైతే సెంట్రల్ జోన్ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. సెంట్రల్‌ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గగన్ ఖోడా పదవీ కాలం ముగిసింది. సో, జోన్ల వారీగా వచ్చే ఇబ్బందిని ఎలా అధిగమిస్తారన్నది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.

సెలెక్టర్, చీఫ్ సెలెక్టర్ల ఎంపిక మార్చి మొదటి వారంలో పూర్తి కానుంది. మార్చి 1, 2 నాటికి ప్రక్రియను కంప్లీట్ చేస్తామని మదన్‌లాల్ పేర్కొన్నారు. టీమిండియా న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చేలోపే జాతీయ సెలక్షన్ కమిటీలో ఇద్దరు కొత్త సెలెక్టర్ల ఎంపిక జరుగుతుందని చెప్పారు. కొత్తగా నియామకమైన సెలక్టర్లే మార్చి 12న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story