అమరావతిలో టెన్షన్ వాతావరణం
మందడం-కృష్ణాయపాలెం మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భూ సర్వేకి వచ్చిన అధికారులను రెండు గ్రామాల ప్రజలు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం రెండు గ్రామాల ప్రజలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కారును అడుగు కూడా కదలనివ్వడం లేదు. సమాధానం చెప్పే వరకు కారు కదలనివ్వబోమంటూ రోడ్డుపైనే కూర్చున్నారు. నాలుగు గంటలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వ భూములు గుర్తించడానికే వచ్చామని ఎమ్మార్వో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భూముల గుర్తింపు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, ఎమ్మార్వో వివరణను ఏమాత్రం పట్టించుకోని రైతులు సీఆర్డీయే పరిధిలో ఏ విధంగా భూములు గుర్తిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీయే కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. సీఆర్డీయే పరిధిలో ప్రభుత్వ భూమి మాస్టర్ ప్లాన్ కిందే ఉంటుందని.. ప్రభుత్వ భూములు వేరే పేదలకు కేటాయిస్తే మాస్టర్ ప్లాన్ పక్కదారి పడుతుందని మందడం, కృష్ణాయపాలెం ప్రజలు ఫైరవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com