నిర్విరామంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

నిర్విరామంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

64వ రోజు కూడా అమరావతిలో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లాయి. ధర్నాలు, దీక్షలు, హోమాలు, ర్యాలీలతో 29 గ్రామాలు అట్టుడుకుతున్నాయి..అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తుళ్లూరు, రాయపూడి, మందడం, పెదపరిమి, వెలగపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నేలపాడులో మహిళలు మాన్యుపాశుపతి హోమం నిర్వహించారు. జగన్ మనసు మార్చాలంటూ చేపట్టిన ఈ యాగంలో... రాజధాని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజధాని భూముల్ని పేదలకు పంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు భగ్గుమంటున్నారు. పేదలు, రైతులకు మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..సర్కారు ఇచ్చే ఫ్లాట్లను ఎవరూ తీసుకోవద్దని కోరారు.

రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. వాళ్లు ఓట్లు వేస్తే గెలవలేదంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ చేసిన వ్యాఖ్యలపై.. మహిళలు మండిపడ్డారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరంలో.. ముఖాలకు మేకప్‌ వేసుకుంటూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవికి మేకప్‌పై ఉన్న శ్రద్ధ మాపై లేదా అని ప్రశ్నించారు.

కృష్ణాయపాలెంలో రైతులు సచివాలయానికి వెళ్లే దారిలో వాహనాలను ఆపి అమరావతి గొప్పదనాన్ని వివరించారు.. అమరావతి ప్రాశస్థ్యాన్ని వివరించే కరపత్రాలు పంచారు. గుంటూరులో జేఏసీ నేతలు చేపడుతున్న దీక్షలు 53వ రోజు కొనసాగాయి . రేపల్లె టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. రాజధాని కోసం 29 గ్రామాల్లో రైతులు దీక్షలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం ఆగదని జేఏసీ నేతలు హెచ్చరించారు.

గుంటూరులో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినదించారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

Tags

Next Story