అమరావతి రైతులపై కేసులు

అమరావతి రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుధవారం ఎమ్మార్వో కారును ఆపినందుకు రైతులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 426 మందిపై కేసులు పెట్టారు. ఏడు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. న్యాయం అడిగిన తమపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు రైతులు. పోలీసు చర్యలకు నిరసనగా మందడంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బస్సులు, వాహనాలను నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.
అమరావతి రాజధాని గ్రామాల్లో భూముల పరిశీలనకు బుధవారం దుగ్గిరాల ఎమ్మార్వో వచ్చారు. కృష్ణాయపాలెం దగ్గర మహిళా అధికారి కారును రైతులు ఆపారు. CRDA పరిధిలోకి వచ్చే తమ ప్రాంతంలో ఎందుకు వచ్చారని ఎమ్మార్వోను ప్రశ్నించారు. ఆమె కారు దిగకపోవడంతో.. సమాధానం చెప్పేవరకు కదలనివ్వబోమని రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం సమయం కావడంతో భోజనం, మంచినీళ్లు కూడా సమకూర్చారు. సీఆర్డీఏ అధికారులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే.. ఎమ్మార్వోను అడ్డుకున్నారంటూ గురువారం కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com