ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి..

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి..

వైసీపీ పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. బొప్పూడిలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర కొనసాగింది. ఒంగోలులో ర్యాలీ నిర్వహించి అద్దంకి బస్టాండ్‌ వద్ద బహిరంగసభలో పాల్గొన్నారు.

అన్యాయంగా వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు తొలగించారని విమర్శించారు చంద్రబాబు. కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తే రేషన్‌ కట్‌ చేస్తామంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రం నుంచి లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. కియాను బెదిరిస్తే వాళ్లు కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ దొంగలకు భద్రత పెంచి..తన సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తనకు భద్రత తగ్గించినా ఇబ్బంది లేదని ప్రజలే కాపాడుకుంటారని అన్నారు చంద్రబాబు.

అమరావతి అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు చంద్రబాబు. రైతులు, ఆడబిడ్డలు రోడ్డుపైకి వస్తే లాఠీఛార్జ్‌ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినట్లేనని అన్నారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం వాళ్లు ఉన్నారని దుష్ర్పచారాం చేశారని మండిపడ్డారు. అమరావతిని శ్మశానం, ఎడారి అని మాట్లాడుతున్నారని, మంత్రులంతా శ్మశానంలోనే పనిచేస్తున్నారా? అని నిలదీశారు. మంగళగిరిలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో నారా లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానలపై మండిపడ్డారు.

నవ మాసాలు.. నవ మోసాలు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేపట్టారు టీడీపీ నేతలు.. మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేసేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Tags

Next Story