ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో విచారణ తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో విచారణ తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో విచారణ తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు నత్తనడకన సాగుతోందని కోర్టు మండిపడింది. మే నాలుగో తేదీనాటికి విచారణ పూర్తి చేయాలని సీబీఐ, ఈడీలకు ఢిల్లీ కోర్టు గడువు విధించింది. ఈ కేసులో 4 దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటరీలను పంపామని, అక్కడి నుంచి స్పందన రావాల్సి ఉందని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి స్పందన రాగానే దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పారు. ఎయిర్‌ సెల్ మాక్సిస్ కేసులో సీబీఐ, ఈడీలు వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాయంటూ 2019 డిసెంబర్ 5న ఢిల్లీ కోర్టు కేసును నిరవధికంగా వాయిదా వేసింది. ఈ ఏడాది జనవరి 28న విచారణ పున:ప్రారంభించింది.

ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నిందితులుగా ఉన్నారు. గత ఏడాది చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అంతకుముందు కార్తీ చిదంబరాన్ని కూడా అరెస్టు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నుంచి అక్రమంగా అనుమతులు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, కార్తీ చిదంబరంలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story