దివ్య హత్య కేసులో చిక్కుముడి వీడింది..

దివ్య హత్య కేసులో చిక్కుముడి వీడింది..
X

దివ్య హత్య కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు వెంకటేశ్ పోలీసులు మందు లొంగిపోయాడు. అంతకుముందు వెంకటేశ్‌ కోసం సిద్ధిపేట పోలీసులు తీవ్రంగా గాలించారు. వేములవాడలోని అతని ఇంటిపై నిఘా వుంచారు. వెంకటేశ్‌ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఐదు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టిన పోలీసులు అన్ని వైపుల నుంచి ఒత్తడి పెంచారు. దీంతో చేసేదేమీ లేక నిందితుడు వెంకటేశ్ పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దివ్యను హత్య చేసింది తానేనని పోలీసుల ముందు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. తన ప్రేమ విఫలం కావడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడానని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత దివ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్నిఎల్లారెడ్డి పేట మండలకేంద్రంలోని స్వగృహానికి తీసుకొచ్చారు. మరో వారం రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఇంటికి దివ్య విగతజీవిగా రావడం గ్రామస్తులను కలచివేసింది. మేళతాళాలు మోగాల్సిన ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. దివ్య మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్యే దివ్య మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

దివ్య మృతిని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి హంతకుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా వుంటున్న దివ్య మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయిందని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని.. కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

ఇదిలావుంటే, దివ్య కేసులో పలు సంచలనాలు వెలుగు చూశాయి. ఎల్లారెడ్డిపేటలో పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే దివ్య, వెంకటేశ్‌ మధ్య చనువు పెరిగినట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో చదివే సమయంలో.. దివ్యను వెంకటేశ్ ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. అయితే, కులాలు వేరుకావడంతో ఈ పెళ్లికి దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను.. హాస్టల్‌లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని.. దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వారి దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది. దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే.. దివ్యను ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లి వచ్చిన దివ్య.. మేడపై ఆరేసిన బట్టలు తీసేందుకు డాబాపైకి వెళ్లింది. కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

దివ్యను దారుణంగా హతమార్చిన తర్వాత నిందితుడు వెంకటేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, పోలీసులు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడం.. విచారణ నిమిత్తం తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో చేసేదేమీలేక లొంగిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి పోలీసుల నిందితుడు లొంగిపోవడంతో హత్య కేసులో చిక్కుముడి వీడినట్టయింది.

Tags

Next Story