మిస్టరీ వీడింది.. నిందితుడు లొంగిపోయాడు

మిస్టరీ వీడింది.. నిందితుడు లొంగిపోయాడు

గజ్వేల్‌ లో దారుణ హత్యకు గురైన బ్యాంక్ ఉద్యోగి దివ్య హత్య కేసులో.. నిందితుడు వెంకటేశ్‌ ఎట్టకేలకు వేములవాడ పోలీస్ స్టేషన్‌ లో లొంగిపోయాడు. మంగళవారం నుంచి పరారీలో వున్న వెంకటేశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే, అతడు పోలీసుల అదుపులోనే వున్నాడంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవడంతో హత్య కేసు మిస్టరీ వీడినట్టయింది.

మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దివ్య డెడ్‌ బాడీని చూడగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దివ్య హత్య కేసులో అనేక కోణాలు వెలుగుచూశాయి. వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు.. హాస్టల్‌లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను.. వెంకటేష్‌ వేధించాడని.. చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని.. దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వారి దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే.. దివ్యను ఎలా అయిన అంతం చేయాలనుకున్నాడు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లి వచ్చిన దివ్య మేడపై ఆరేసిన బట్టలు తీసేందుకు డాబాపైకి వెళ్లింది. కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

దాడిచేసిన తర్వాత వెంకటేష్‌ అక్కడి నుంచి పారారయ్యాడు. దీంతో అతని కోసం రెండురోజుల పాటు పోలీసులు గాలించారు. ఎట్టకేలకు వెంకటేశే పోలీసుల ముందు లొంగిపోవడంతో హత్యకేసులో చిక్కుముడి వీడినట్టయింది.

================================

Tags

Read MoreRead Less
Next Story