ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు: నిర్భయ తల్లిదండ్రులు
నిర్భయ కేసులో దోషులు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. చట్టం, న్యాయపరంగా అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఉరిశిక్షను తప్పించుకోవడానికి కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆత్యాహత్యాయత్నం లాంటి ప్రయత్నాలతో మరణశిక్షను వాయిదా వేయించాలని చూస్తున్నారు. తాజాగా, వినయ్‌శర్మ అనే దోషి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తీహార్ జైలులో తలను గోడకు బాదుకున్నాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వినయ్‌శర్మ తలకు కొద్దిగా గాయలయ్యాయని, అతని ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
మార్చ్ 3న నలుగురు దోషులను ఉరి తీయాలంటూ ఢిల్లీ పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22, ఫిబ్రవరి 1వ తేదీల్లో మరణశిక్ష అమలు చేయాలంటూ రెండు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ శిక్ష అమలు చేయడం సాధ్యం కాలేదు. దాంతో మూడోసారి డెత్ వారెంట్ ఇష్యూ చేశారు. ఐతే, నలుగురు దోషుల్లో ముగ్గురు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు. పవన్ గుప్తా మాత్రం ఇంకా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. మరో దోషి వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు వెల్లడించారు. ఇదంతా శిక్షను వాయిదా వేయించడానికి ఆడు తున్న నాటకాలని నిర్భయ తల్లిదండ్రులు అంటున్నారు. దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం చోటు చేసుకోవద్దని కోరుతున్నారు. నిర్భయకు న్యాయం జరగకపోతే హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com