పాకిస్థాన్ జిందాబాద్ అన్న యువతి.. ఆగ్రహం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఓ హిందూ యువతి వేదికపైకి వచ్చి పాక్ అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఈ ఘటన జరిగింది. అమూల్య అనే యువతి అకస్మాత్తుగా మైక్ తీసుకుని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ మూడు సార్లు నినాదాలు చేసింది. దీంతో వేదికపై ఉన్న మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సహా ఇతరులంతా షాక్ కు గురయ్యారు. సభావేదికపై ఉన్న అసదుద్దీన్ ఒవైసీ పరుగున వచ్చి ఆ యువతి నుంచి మైక్ లాక్కునే యత్నం చేశారు. అయితే మైక్ ఇచ్చేందుకు నిరాకరించిన అమూల్య పాక్ అనుకూల నినాదాలు కొనసాగించింది. తరువాత పోలీసులు రావడంతో జై హిందూస్థాన్ అంటూ నినాదాలు కొనసాగించే ప్రయత్నం చేసింది.
దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దంటూ అసద్ వారించారు. యువతిపై వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇలా జరుగుతుందని భావిస్తే అసలు ఈ సభకే రాకుండా ఉండేవాణ్ని అని అసద్ అసహనం వ్యక్తం చేశారు. సభ నిర్వాహకులు.. పోలీసులు అమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గలేదు అమూల్య. జైహింద్ అంటూ నినాదాలు కొనసాగించింది. తరువాత ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం యువతిపై సెక్షన్ 124ఏ ప్రకారం కేసు నమోదు చేసింది. ఇంటరాగేషన్ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు ఈ ఘటనపై ఒవైసీ క్షమాపణలు చెప్పారు. తామంతా భారతీయులమని స్పష్టం చేశారు. ఆ యువతితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సభను భగ్నం చేసే కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com