అమరావతి ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

అమరావతి ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

అమరావతి ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. బుధవారం రాజధాని గ్రామాల్లో భూసర్వే చేసేందుకు వచ్చిన ఎమ్మార్వోను అడ్డుకున్నారంటూ రైతులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 426 మందిపై ఏడు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. న్యాయం కోసం నినదిస్తే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు రైతులు. పోలీసు చర్యలకు నిరసనగా మందడంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భారీగా తరలి వచ్చిన ప్రజలు.. బస్సులు, వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు.

ఇంతలో ఓ కానిస్టేబుల్‌ డ్రోన్‌ కెమెరాతో గ్రామంలోని దృశ్యాలను చిత్రీకరించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓపెన్ బాత్‌రూములపైకి డ్రోన్‌ రావడంతో.. మహిళలు ఉలిక్కిపడ్డారు. స్నానాలు చేస్తుండగా ఉద్దేశపూర్వకంగానే వీడియో చిత్రీకరించారంటూ ఆందోళనకు దిగారు.

రాజధాని కోసం ప్రశాంతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మహిళలు. ఏదో ఒక సాకుతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.. తామేమైనా ఉగ్రవాదులమా.. లేక బాంబులు వేస్తున్నామా అని ప్రశ్నించారు.

మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీశారంటూ తుళ్లూరు DSP శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు మహిళలు. దిశ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రోన్‌తో చిత్రీకరించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగినవారిపై దౌర్జన్యంగా వ్యవహరించారు పోలీసులు. ఖాకీల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ షర్ట్‌ను మొత్తం చింపేశారు.

మందడంలో జరిగిన ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, మాజీ మంత్రి జవహర్‌ ను నియమించారు. చంద్రబాబు ఆదేశాలతో ఈ బృందం హుటాహుటిన వెళ్లి మందడంలో పర్యటించింది. పోలీసుల అత్యుత్సాహంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే డీఎస్పీ లాఠీచార్జీకి ఆదేశాలు ఇవ్వడం, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంపై మండిపడ్డారు. మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఫైర్ అయ్యారు.

అటు రాజధానిలో 29 గ్రామాల్లోనూ ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 65 రోజు కూడా జై అమరావతి.. సేవ్ అమరావతి నినాదాలు మార్మోగాయి. ధర్నాలు, దీక్షలు.. నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు రైతులు.

Tags

Next Story