జై అమరావతి నినాదాన్ని హోరెత్తిస్తున్న రాజధాని రైతులు

అదే జోరు.. అదే హోరు.. రాజధాని గ్రామాల్లో 65 రోజు కూడా ఉద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. జై అమరావతి.. సేవ్ అమరావతి నినాదాలతో రాజధాని ప్రాంతం మారుమోగుతోంది. రైతులు, మహిళలు, యువకులు అని తేడాలేకుండా.. ప్రతి ఒక్కరూ రాజధాని కోసం రోడ్డెక్కారు. అమరావతిలోనే రాజధాని వుండాలంటూ నినదిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో పోలీసుల అత్యుత్సాహంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే డీఎస్పీ లాఠీచార్జీకి ఆదేశాలు ఇవ్వడం, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంపై మండిపడ్డారు. డ్రోన్ కెమెరాలో చిత్రీకరించి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. శిబిరం వద్దే కాకుండా.. ఇళ్లపైనా డ్రోన్ కెమెరాలు తిప్పడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మందడంలో జరిగిన ఈ ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి జవహర్ ను నియమించారు. చంద్రబాబు ఆదేశాలతో నిజనిర్ధారణ బృందం హుటాహుటిన మందడం బయల్దేరి వెళ్లింది. మరికాసేపట్లో నిజనిర్ధారణ కమిటీ మందడంలో పర్యటించనుంది. రైతులు, రైతు కూలీలు, మహిళలను కమిటీ సభ్యులు విచారించనున్నారు.
29 గ్రామాల్లో ధర్నాలు, దీక్షలు.. నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. తాము ఏం పాపం చేశామని ఇంత శిక్ష విధించారని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిన్న ఎమ్మార్వో కారును ఆపినందుకు రైతులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 426 మందిపై కేసులు పెట్టారు. ఏడు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. న్యాయం అడిగిన తమపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు రైతులు. పోలీసు చర్యలకు నిరసనగా మందడంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.. బస్సులు, వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు.
మందడంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ కానిస్టేబుల్ గ్రామంలో డ్రోన్ కెమెరాతో దృశ్యాలను చిత్రీకరించడపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు స్నానం చేస్తుండగా... ఉద్దేశపూర్వకంగానే వీడియో చిత్రీకరించారంటూ ఆందోళనకు దిగారు. డ్రోన్ ఆపరేట్ చేసిన కానిస్టేబుల్‌ను అడ్డుకున్నారు. గ్రామస్తులను అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
రాజధాని కోసం ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న తమపై పోలీసులు దాష్టీకాలు చేస్తున్నారని మందడం మహిళలు మండిపడుతున్నారు. పోలీసులు తమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదో ఒక సాకుతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని... మహిళలు అని కూడా చూడకుండా కొడుతున్నారని.. గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com