అమరలింగేశ్వరుడి సాక్షిగా ఉద్యమాన్ని తుది వరకూ కొనసాగిస్తాం: రైతులు
అమరావతి అమరలింగేశ్వరుడి సాక్షిగా రాజధాని ఉద్యమాన్ని తుది వరకూ కొనసాగిస్తామంటున్నారు రైతులు, రైతు కూలీలు, మహిళలు. పండగపూట శివయ్యను స్మరించుకుని ఎప్పట్లాగే దీక్షా శిబిరాలకు తరలివచ్చారు. నమఃశివాయ అంటూ శివపంచాక్షరి జపిస్తూనే జై అమరావతి అంటూ నినదిస్తున్నారు. 66వ రోజు కూడా శాంతియుతంగానే తాము దీక్షలు కొనసాగిస్తామంటున్నారు. ధర్నా చేస్తే కేసు.. నిరసన తెలిపితే కేసు.. ప్రశ్నిస్తే కేసు.. అంటూ అమరావతి ఉద్యమంపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నా తాము వెనక్కు తగ్గేది లేదంటున్నారు. రాజధాని పోరాటంలో ప్రాణాలైనా అర్పిస్తామని చెప్తున్నారు.
తహసీల్దారును అడ్డగించారన్న కారణంగా 426 మంది రైతులపై కేసులు పెట్టడం నిన్నంతా ఆగ్రహావేశాలకు కారణమైంది. అక్రమ కేసులు ఎత్తేయాలంటూ పెద్దఎత్తున రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. కృష్ణాయపాలెం, మందడంలో నిన్నరోజంతా ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి. తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెనుమాక, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో నిరసనలు హోరెత్తాయి. అమరావతి JAC కూడా అక్రమ కేసులపై మండిపడింది. న్యాయం కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టి వేధించడం ఏం పెద్దరికమని CM, మంత్రులను ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com