పనిచేయకపోతే.. పోస్టులు ఊడిపోతాయ్: కేటీఆర్

పనిచేయకపోతే.. పోస్టులు ఊడిపోతాయ్: కేటీఆర్

మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్... యువత, కుల సంఘాలను కూడా పల్లెప్రగతిలో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని.. వచ్చె నెల నుంచి సీఎం కేసీఆర్ కూడా వస్తారని చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమన్న కేటీఆర్.. ఇందులో భాగంగానే సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పంచాయతీ రాజ్‌, మున్సిపల్ చట్టాలు కఠినంగా ఉంటాయని.. పని చేయకపోతే పోస్టులు గల్లంతవుతాయని వార్నింగ్ ఇచ్చారు.

అంతకుముందు.. సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను కేటీఆర్ సందర్శించారు. అక్కడి వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వేధింపులకు గురైన తొమ్మిది మంది విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. జిల్లాలోని అన్ని బాలికల హాస్టళ్లలో ఆత్మరక్షణ కోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నిరంతరాయంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్‌,ఎస్పీలను ఆదేశించామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story