మేము టేకప్ చేసిన తరువాతే.. ప్రీతి కేసుపై ప్రభుత్వం స్పందించింది: పవన్ కళ్యాణ్

మేము టేకప్ చేసిన తరువాతే.. ప్రీతి కేసుపై ప్రభుత్వం స్పందించింది: పవన్ కళ్యాణ్

పాతికేళ్లు రాజకీయాల్లో ఉండడానికే వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గెలుపోటములకు భయపడబోనని, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే ఉంటానని చెప్పారు. ఢిల్లీలో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన తనకు చిన్నప్పటినుంచే ఉండేదని పవన్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ తనకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. రాజకీయాల్లో తక్షణ ఫలితాలు ఆశించవద్దని, దీర్ఘకాల లక్ష్యాలు ఏర్పరచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించకపోయినా.. సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషించామన్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోని సుగాలి ప్రీతి కేసును తాము టేకప్ చేశామని, ఆ తర్వాతే ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు.

అంతకుముందు.. పవన్‌ కళ్యాణ్ ఢిల్లీలో... అమరసైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో అధికారులకు చెక్‌ అందచేశారు. సైనిక్ బోర్డుకు సహాయం అందించాలనే బ్రిగేడియర్‌ వీరేంద్ర కుమార్ లేఖ తనను కదిలించిందన్నారాయన. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు పవన్‌.

Tags

Next Story