ఉద్యమంలో తగ్గని జోరు.. హోరు..

ఉద్యమంలో తగ్గని జోరు.. హోరు..

అమరావతి ఉద్యమం 67వ రోజుకు చేరుకుంది. ఉద్యమంలో మాత్రం అదే జోరు కొనసాగుతోంది. ఇటు శివరాత్రి ఉపవాసం చేస్తూనే.. అటు రాజధాని కోసం ఆందోళనలు కొనసాగించారు. ధర్నాలు, దీక్షలతో అమరావతి నినాదం మార్మోగింది. కోటప్పకొండలో రాజధాని రైతుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని ఉద్యమం 66వ రోజు మహోగ్రంగా సాగింది. అమరావతి గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. కృష్ణాయపాలెం, మందడం, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి..తాడికొండ అడ్డరోడ్డు, పెనుమాక, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో ఆందోళనలు ఉద్ధృతం అయ్యాయి. శివరాత్రి వేళ దీక్షా శిబిరాలకు తరలివచ్చారు రైతులు. ఓవైపు శివపంచాక్షరీ మంత్రం జపిస్తూనే.. అమరావతి కోసం నినదించారు.

అటు పోలీసులు ఉద్యమంపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. ధర్నా చేస్తే కేసు.. నిరసన తెలిపితే కేసు.. ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు. ఐనా.. వెనక్కు తగ్గేది లేదంటున్నారు రైతులు. వైసీపీ సర్కార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.. రాజధాని పోరాటంలో ప్రాణాలైనా అర్పిస్తామని తెగేసి చెప్తున్నారు. మరోవైపు.. మందడం వచ్చిన పలువురు విశాఖ వాసులు రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. విశాఖ వాసులే వద్దంటుంటే అక్కడికి రాజధాని తరలింపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

వెలగపూడిలో చిన్నారులు భక్తిపాటలకు నృత్యాలు చేశారు. సీఎం జగన్‌కు శివుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వేడుకున్నారు. కృష్ణాయపాలెం శివాలయంలో జై అమరావతి నినాదాలు మార్మోగాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజధాని రైతులు, మహిళలు కోటప్పకొండలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ ముక్కంటికి మొక్కులు చెల్లించుకున్నారు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి పేరుతో ఏర్పాటు చేసిన ప్రభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభల ఉత్సవంలో అమరావతి నినాదాలు మార్మోగాయి.

అమరావతిలో పేదలకు పట్టాల పేరుతో రైతులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు మండిపడుతున్నారు. భూములిచ్చిన రైతుల్ని రోడ్డుపైకి తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story