అమూల్య లియోనాపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు

అమూల్య లియోనాపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు

అమూల్య లియోనా వివాదం ముదురుతోంది. అమూల్య లాంటి వాళ్లు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా అమూల్యే ఈ విషయాన్ని బయటపెట్టింది. తనలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని, తాము చాలాసార్లు డిస్కషన్ చేసుకుంటామని తెలిపింది. అమూల్య లియోన్ పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసి కలకలం రేపింది. పోలీసుల విచారణలో ఆమె సంచలన విషయాలు బయట పెట్టినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడేవాళ్లు తన గ్రూప్‌లో చాలామందే ఉన్నారని అమూల్య చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక, అమూల్య వివాదం ఆమె కుటుంబంపై పడింది. అమూల్య ఇంటిపై దుండగులు దాడి చేశారు. కొప్పల్‌లోని గుల్లగడ్డెలో అమూల్య కుటుంబం నివాసం ఉంటోంది. పాకిస్థాన్‌కు మద్ధతుగా అమూల్య నినాదాలు చేసిందనే విషయం ప్రచారం కావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు, అమూల్య ఇంటిపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై అమూల్య తండ్రి వాజీ కొప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు వెంటనే వాజీ కుటుంబానికి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, అమూల్య తండ్రి వాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమూల్యపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆమె కాళ్లూ చేతులు విరగ్గొట్టినా తనకు ఇబ్బంది లేదన్నారు. అమూల్యపై చట్టప్రకారం ఎలాంటి చర్య తీసుకున్నా తనకు అంగీకారమేనన్నారు. శత్రు దేశానికి మద్ధతుగా వ్యాఖ్యలు చేయడం మంచి పని కానే కాదన్నారు. ఇలా ప్రవర్తించవద్దని అమూల్యకు తాను గతంలో చాలా సార్లు చెప్పానని, ఐనప్పటికీ ఆమె వినిపించుకోలేదన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ జరిగింది. కార్యక్రమం జరుగుతుండగా అమూల్య లియోన పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఆమె మాటలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వేదికపైనే ఆమె పాకిస్థాన్‌కు మద్ధతుగా స్లోగన్స్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఆమె నినాదాలు విన్న ఒవైసీ వెంటనే స్పందించారు. ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. నిర్వాహకులు ఆమె నుంచి మైక్‌ లాక్కుందామని ప్రయత్నించినా నినాదాలు కొనసాగించింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అమూల్యపై దేశద్రోహం కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Tags

Next Story