ఆంధ్రప్రదేశ్ ఈఎస్‌ఐలో కుంభకోణం

ఆంధ్రప్రదేశ్ ఈఎస్‌ఐలో కుంభకోణం

ఆంధ్రప్రదేశ్ ESIలోనూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 975 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో 70 కోట్ల రూపాయల స్కామ్‌ జరిగినట్టు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. గత 6 ఏళ్లలో జరిగిన కుంభకోణంగా తేల్చారు. 2014-19 మధ్య కాలంలో జరిపిన కొనుగోళ్ల డాక్యుమెంట్లను పరిశీలించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలంలో అక్రమాలను గుర్తించారు. ఏపీవ్యాప్తంగా ఉన్న 4 ESI ఆస్పత్రులు, 3 డయాగ్నోసిట్క్ సెంటర్లు, 78 డిస్పెన్సరీల పరిధిలో స్కామ్‌ చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

తెలంగాణలో జరిగిన ESI స్కామ్‌లో ముఖ్యపాత్ర పోషించిన సరఫరాదారులే ఏపీలోను చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైన అభియోగంలో ఈఎస్‌ఐ డైరెక్టర్లు రవి కుమార్‌, రమేష్‌, విజయలను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని.. ఆర్డర్లు చేసి స్కామ్‌కు పాల్పడ్డారు. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్, ఓమ్నిమెడి, ఎన్వెంటర్ పర్‌ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా డబ్బులు చెల్లించినట్టు తేలింది. ఈఎస్‌ఐ డైరెక్టర్లకు.. ఆరుగురు జాయింట్‌ డైరెక్టర్లు సహకరించారని తేలింది. తెరవెనుక సూత్రధారులెవరు.. పాత్రధారులెవరో నిగ్గుతేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు నిమగ్నం అయ్యారు.

ESI స్కామ్‌పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. చంద్రబాబు హయాంలో కుంభకోణం జరిగిందని.. నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. వాటిని ఖండించారు అచ్చెన్నాయుడు.

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేస్తున్నందుకే అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ నాయకుడిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 7.96 కోట్ల రూపాయలు విలువైన టెలీ మెడిసిన్ ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి ఎలా సాధ్యమని కొల్లు ప్రశ్నించారు. విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడి పేరే లేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story