భార్య కాపురానికి రాలేదని కూతురిని కిడ్నాప్‌ చేసిన తండ్రి

భార్య కాపురానికి రాలేదని కూతురిని కిడ్నాప్‌ చేసిన తండ్రి

సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రానని మొండికేయడంతో తన మూడేళ్ల కూతురిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుపడ్డ తన భార్య మేనమామను కారుతో గుద్దేశాడు.. రెండు కిలోమీటర్ల బానెట్‌పైనే ఈడ్చుకెళ్లి చంపేశారు. ఈ సంఘటన నేరేడుచర్లలో తీవ్ర కలకలం రేపింది.

నేరేడుచర్లకు చెందిన లారీ డ్రైవర్‌ గుంజ శంకర్‌.. తన అక్క యాదమ్మ కూతురు శ్రీదేవిని ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సుజయ్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. అయితే తరచూ భార్యతో కట్నం కోసం గొడవపడేవాడు. 18న ఆమెను పుట్టింటికి పంపించాడు. 20న నేరేడుచర్లకు సుజయ్ రావడంతో.. తాను భర్తతో కాపురానికి వెళ్లేది లేదని ఆమె తేల్చిచెప్పడంతో.. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మద్యం మత్తులో ఉన్న సుజయ్‌ తమ కూతురును కారులోకి బలవంతంగా ఎక్కించుకుని, కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో శంకర్‌ కారుకు అడ్డుపడ్డాడు.

తాగిన మైకంలో ఉన్న సుజయ్‌.. శంకర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ ఎగిరి.. బానెట్‌పై పడ్డాడు. కారును ఆపకుండా రెండు కిలోమీటర్లు తీసుకెళ్లాడు. సుజయ్ అతడి మీద నుంచి కారు పోనిచ్చి ఈడ్చుకెళ్లాడు. తీవ్రగాయాలైన శంకర్‌ను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండా.. మార్గమధ్యంలో చనిపోయాడు. శంకర్‌ భార్య శైలజ ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పిడుగురాళ్ల వైపు వెళ్తున్న సుజయ్‌ని పాలకవీడు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సుజయ్‌ వారిపైనుంచి కూడా కారును పోనిచ్చేందుకు ప్రయత్నించాడు. తృటిలో పోలీసులు తప్పించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story