ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వంలోని అవకతవకలు వెలికితీసే పనిలో..
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న నిర్ణయాలు, ఏర్పాటు చేసిన సంస్థలతో పాటు కార్పోరేషన్లు అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ పరిధిలో అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, సీఆర్డీఏ సరిహద్దులు మార్పు, బినామీ లావాదేవీలపై ప్రత్యేకంగా ఫోకస్ సిట్ పెట్టనుంది. ఎంక్వైరీ చేయనున్న సిట్ కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది.
అధికారంలో వచ్చిన దగ్గర్నుంచి నుంచి గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని చెబుతూనే ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజధాని భూముల వ్యవహారంలో మునుపెన్నడూ జరగనంతగా అక్రమాలు జరిగియని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మంత్రులు విమర్శల వర్షం కురిపించారు. అయితే..ఇప్పుడు తమ ఆరోపణలకు సాక్ష్యాలను వెతుక్కునే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు తీసుకున్న నిర్ణయాలపై కూడా విచారణ చేపట్టనుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. మొత్తం 10 మంది సభ్యులున్న కమిటీలో ముగ్గురు ఐపీఎస్ లు మరో నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను నియమించింది ప్రభుత్వం. సిట్ టీంను కూడా ఏరికోరి ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సిట్‌లోని సభ్యులుగా బాబూజీ అట్టాడ - విశాఖపట్నం ఎస్పీ, సీహెచ్ వెంకట అప్పలనాయుడు ఇంటెలిజెన్స్ ఎస్పీలను నియమించింది. ఇక శ్రీనివాస్ రెడ్డి -కడప అడిషనల్ ఎస్పీ,
జయరామరాజు -డీఎస్పీ, ఇంటెలిజెన్స్, విజయభాస్కర్-డీఎస్పీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎం.గిరిధర్ -ఇంటలిజెన్స్ డీఎస్పీ, కెన్నెడీ-ఎలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాసన్- నెల్లూరు ఇన్‌స్పెక్టర్, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి -గుంటూరు ఇన్‌స్పెక్టర్ సిట్ లో సభ్యులుగా ఉన్నారు.
గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీయటమే లక్ష్యంగా సిట్ ఏర్పాటైంది. గతంలో మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీల ఆరోపణలపై సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్ విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వం హాయంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపైనా దృష్టిసారించనుంది. ఇక సిట్ కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టినట్టు సమాచారం. సాక్షుల విచారణ మొదలుకుని ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వరకు సిట్ కు అధికారాలు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో క్లారిటీ ఇచ్చింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిచి ప్రశ్నించే అధికారం సిట్ కు ఉంన్నట్లు జీవోల స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు ఎంక్వైరీకి సంబంధించి విడుదల చేసిన జీవోలో సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పోరేషన్ వ్యవహరాలు ఇక సిట్ పరిధిలోకి రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com