మరో షాహీన్‌ బాగ్ ను తలపించిన జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌..

మరో షాహీన్‌ బాగ్ ను తలపించిన జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌..

దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక సెగలు రగులుతూనేవున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ ఏరియా మరో షాహీన్‌ బాగ్ ను తలపించింది. రాత్రికి రాత్రే వెయ్యిమందికి పైగా మహిళలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.

పెద్దయెత్తున రోడ్డుపైకి వచ్చిన మహిళలు.. సీలంపూర్ - మౌజ్‌ పూర్, యమునా విహార్ వైపు వెళ్లే రోడ్డు నెంబర్ 66ని బ్లాక్ చేశారు. ఈ హఠాత్ పరిణామానికి.. ఆ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలిపారు. జాతీయ జెండా చేతబట్టి ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది.

రాత్రికే రాత్రే వెయ్యి మంది మహిళలు నిరసనకు దిగడంతో.. జాఫ్రాబాద్ స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. జాఫ్రాబాద్‌కు సమీపంలోని సీలంపూర్, కర్దంపురిలో ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే షాహీన్‌ బాగ్‌ లో గత రెండు నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాఫ్రాబాద్‌ రూపంలో మరో కొత్త శిబిరం పుట్టుకురావడంతో.. ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story