ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఏనాడూ తప్పు చేయలేదు..చేయదు : చంద్రబాబు

టీడీపీ ఏనాడూ తప్పు చేయలేదు..చేయదు : చంద్రబాబు
X

ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న నిర్ణయాలు, సంస్థల ఏర్పాటుపై విచారణకు.. జగన్‌ సర్కార్‌ సిట్ ఏర్పాటు చేయడం రాజకీయ దుమారం రేపుతుంది. తనపై, టీడీపీపై ఈ ప్రభుత్వానికి ఎంతో కక్ష ఉందో చెప్పేందుకు ఈ సిట్టే ఓ ఉదాహరణ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు . 9 నెలల్లో మూడు సిట్‌లు, 5 కమిటీలు, కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులు తరిమేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోందన్నారు. మీ పాలనపై వచ్చే ప్రభుత్వం సిట్‌ వేస్తుందని, వీటితో ప్రజలకు ఒరిగేది ఏంటని నిలదీశారు. వైఎస్ హయంలోనూ 26 ఎంక్వైరీలు వేసి ఏం తేల్చలేకపోయారని అన్నారు. టీడీపీ ఏనాడూ తప్పు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడమని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగానే సిట్‌ దర్యాప్తునకు ఆదేశించామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. గత ప్రభుత్వంపై బురదజల్లడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM జగన్ కార్యాలయం కేంద్రంగా బీసీ నేతలపై కుట్రలకు తెరలేపారని ఆరోపించారు టీడీపీ నేతలు. తెలుగుదేశం నేతల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుని ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు పాలనపై సిట్‌ వేశారని ఆరోపించారు. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు మంత్రి బొత్స. అమరావతిలో భూ కుంభకోణంపై విచారణ చేయించండి, సీబీఐ ఎంక్వైరీ వేయండి అంటూ గోల చేసిన టీడీపీ.. ఇప్పుడు సిట్‌ ఏర్పాటును ఎందుకు తప్పుపడుతోందని నిలదీశారు. రాజధానిలో భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని గతంలోనే చెప్పామని.. ఇప్పుడు విచారణ చేయిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పని చేసిన బీసీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారనడం హాస్యాస్పదం అన్నారు మంత్రి బొత్స.

సాధారణంగా సంచలన సంఘటన, విస్తృతమైన పరిధిలో ఉన్న అంశంపై ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తారు. కాని ఇప్పుడు నిర్దిష్టంగా ఒక్క అంశంపై కాకుండా..టోటల్‌గా గత ఐదేళ్ల పాలన కాలంలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలపై సిట్‌ వేయడంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story

RELATED STORIES