24 Feb 2020 1:01 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / బాలీవుడ్‌ బిగ్‌...

బాలీవుడ్‌ బిగ్‌ షాట్స్‌ ను గడగడలాడించిన అండర్‌ వరల్డ్‌ డాన్ అరెస్టు

బాలీవుడ్‌ బిగ్‌ షాట్స్‌ ను గడగడలాడించిన అండర్‌ వరల్డ్‌ డాన్ అరెస్టు
X

200కిపైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ రవి పూజారి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. చోటారాజన్‌, దావూద్‌ ఇబ్రహీం అనుచరుడిగా ఉంటూ ఆ తర్వాత అండర్‌ వరల్డ్‌ డాన్ గా ఎదిగిన అతన్ని సౌతాఫ్రికాలో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మర్డర్లు, దోపిడిలతో పాటు బాలీవుడ్‌ బిగ్‌ షాట్స్‌ ను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు రవి పూజారిపై ఆరోపణలు ఉన్నాయి.

చోటారాజన్ దగ్గర శిష్యరికం చేశాడు. దావూద్ ఇబ్రహీం దగ్గర డాన్ ఎలా చలామణి కావాలో ఎలా బెదిరించాలో ఒంటబట్టించుకున్నాడు. తర్వాత తానే సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అండర్ వరల్డ్ డాన్ అయ్యాడు. ఇండియాకు మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ రవి పూజారి. మిలినియమ్ ఇయర్ లో అతని అరాచాకాలు పీక్స్ కు చేరాయి. మర్డర్ లు, సెటిల్మెంట్లు, దోపిడిలు, బెదిరింపులకు పాల్పడుతూ డాన్ గా అవతరించాడు. బాలీవుడ్ లో అతని పేరు చెబితేనే వణికిపోయేంతగా ఎదిగిపోయాడు.

200కిపై నేరాల్లో అతను నిందితుడు. అయినా..20 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కర్నాటకలో అతనిపై కుప్పులుతెప్పులుగా కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డాన్ ఎట్టకేలకు పట్టుడ్డాడు. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సెనగల్‌ పోలీసులు..ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి సౌతాఫ్రికాలో అతన్ని అరెస్ట్ చేశారు.

20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్‌ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. అయితే..అతని కదలికలను పసిగట్టిన రా అతను సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం అందించాయి. దీంతో సౌతాఫ్రికా, సెనెగల్, ఇండియన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పూజారి రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని సెనెగల్ తరలించారు.

రవి పూజారి భార్య పేరు పద్మ.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి వేరే దేశాల్లో పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ మధ్యే అతని కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆస్ట్రేలియన్ పాస్‌పోర్టు ఉన్నట్టు గుర్తించారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం సెనెగల్ నుంచి అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత అతన్ని.. NIA, CBI, రా విభాగాలు అదుపులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అతని విచారణలో మరికొందరు బడాబాబుల చీకటి బండారం బయటకొస్తుందని భావిస్తున్నారు.

Next Story