24 Feb 2020 11:30 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / ట్రంప్‌ తొలి భారత...

ట్రంప్‌ తొలి భారత పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆసక్తి

ట్రంప్‌ తొలి భారత పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆసక్తి
X

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి భారత పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కుటుంబంతో సహా ట్రంప్‌ గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లో మధ్యాహ్నం అడుగుపెట్టనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషం. ప్రొటొకాల్‌కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం. ట్రంప్‌తో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా, కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్‌ కుష్నర్‌ కూడా భారత్‌ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్‌తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది.

భారత్‌లో తొలుత ట్రంప్‌ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొంటారు. దాదాపు 22 కిలోమీటర్లు ఈ రోడ్‌ షో జరుగుతుంది. రోడ్‌ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. తరువాత కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం ఉంటుంది. ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ బాలీవుడ్‌ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్‌లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ కార్యక్రమం తరహాలో ఈ నమస్తే ట్రంప్‌ ఉంటుంది.

ఆ కార్యక్రమం తరువాత ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్‌ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్‌ మౌర్య షెరాటన్‌లో సేద తీరుతారు.

ఈ ట్రంప్‌ పర్యటనతో రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. వాణిజ్య పన్నుల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్‌ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. తరువాత హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్‌ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. తరువాత యూఎస్‌ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్‌ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్‌నాథ్‌ కోవింద్‌ను ట్రంప్‌ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్‌ భారత్‌లో గడపనున్నారు.

Next Story