50 వేలకు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇందుకోసం జీవో జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో లబ్దిదారులకు ఇక్కడ ఇళ్ల స్థలాలిస్తారు. మొత్తం 54 వేల 307 మందికి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. 12 వందల 51.5 ఎకరాలు పంపిణీ చేయబోతున్నారు. ఇందుకోసం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను గుర్తించారు. రాజధాని పరిధిలోని నవులూరులో 215 ఎకరాలు, మందడంలో 169.3 ఎకరాలు, నిడమర్రులో 583 ఎకరాలు, కురగల్లులో 38.3 ఎకరాలు, ఐనవోలులో 53.1 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 193.27 ఎకరాలు ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. 'నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా ఈ భూపంపిణీకి నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల కేటాయింపు కోసం రాజధాని ప్రాంతంలో కొంత భూమి ఇవ్వాలని కృష్ణా, గుంటూరు కలెక్టర్లు CRDA అధికారులను కోరారు. దీంతో.. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూమిలో 5 శాతం పేదల ఇళ్ల పట్టాల కోసం కేటాయించేందుకు CRDA చట్టం అనుమతిస్తున్నందున సమ్మతి తెలిపారు.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లోని పేదలకు, అలాగే కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ నగరంలో ఉన్న అర్హులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. తాడేపల్లిలో 11వేల 300 మంది, పెదకాకానిలో 1,308 మంది, మంగళగిరిలో 10వేల 247 మందికి, దుగ్గిరాలలో 2,500 మందికి ఇళ్ల పట్టాలిస్తారు. అలాగే వియవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన పేదలు 28 వేల 952 మందికి స్థలాలు ఇస్తారు. మొత్తంగా 54 వేల 307 మందిని లబ్దిదారులుగా చెప్తూ ఈ జీవో వచ్చింది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున కేటాయించి వాటిని అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత CRDA చూస్తుంది. రెవెన్యు శాఖ నుంచి ఇందుకు నిధులు కేటాయిస్తారు. మహిళల పేరుపైనే ఈ ఇళ్ల పట్టా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com