రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు : చంద్రబాబు
రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వారికి వ్యూహాలను నిర్దేశిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుప్పంలో కొన్నేళ్లుగా కొత్తపేట వాసులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. రైల్వే గేట్ సమస్య తీర్చడం కోసం అండర్ బ్రిడ్జ్ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయగా.. ఇప్పటి ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసింది.. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కొత్తపేట వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎంపీటీసీ కృష్ణన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఇటీవలే ఆయన కుమారుడు ధనుష్ అకాల మరణం చెందారు. ధనుష్ మరణంపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెండుగంపల్లిలో పది రోజుల క్రితం ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త హేమంత్ కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు.
ఆ తర్వాత కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన మీద.. ప్రజల్ని చైతన్య పర్చేందుకే చైతన్య యాత్ర చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టడమే పనిగా ప్రభుత్వం సిట్ వేసిందని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఇక అన్న క్యాంటీన్ల మూసివేతపైనా చంద్రబాబు ఘాటుగా రియాక్టయ్యారు.. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపుకొట్టారని మండిపడ్డారు. ఇసుక కొరత సృష్టించి పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టారని.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం విశాఖ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. వైసీపీ బాగోతాన్ని అక్కడే బయటపెడతానని చెప్పారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందని, పేదవాళ్ల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఇక ఈరోజు కూడా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com