ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి విందు.. వారికి మాత్రమే ఆహ్వానం

ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి విందు.. వారికి మాత్రమే ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో చర్చలు, ఒప్పందాలపైనే ట్రంప్ దృష్టి పెట్టనున్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్య లపై మంతనాలు జరపనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు స్వాగత కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్తారు. అక్కడ జాతిపిత మహాత్మగాంధీ స్మృతివనం వద్ద నివాళులర్పిస్తారు.

ఆ తర్వాత హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని మోదీతో ట్రంప్ సమావేశమవుతారు. ఆర్థిక, వాణిజ్య, ఐటీ రంగాల్లో పరస్పర సహకారంపై ట్రంప్-మోదీ చర్చిస్తారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సంకేతాలిచ్చారు. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను భారత్‌కు అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాల బలోపేతానికి అడ్వాన్స్‌డ్ వెపన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి MH-60 ఆర్.సి.హాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని తీర్మానించింది. మరికొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత మోదీ-ట్రంప్‌ అధికారిక మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఇక ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. హ్యాపీ కరిక్యులమ్‌ గురించి అడిగి తెలుసుకుంటారు. స్కూల్ విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తారు. మోదీతో ట్రంప్ సమావేశమైన సమయంలోనే మెలానియా స్కూల్ విజిట్ కొనసాగుతుంది.

చర్చలు, మంతనాలు అనంతరం ట్రంప్ దంపతులు విందులో పాల్గొంటారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు దేశవ్యాప్తంగా 95 మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం పంపారు. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఉభయసభల్లో విపక్ష నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. విందు కార్యక్రమం ముగిసిన తర్వాత అమెరికా రాయబార సిబ్బందితో ట్రంప్‌ సమావేశమవుతారు.. ఆ తర్వాత రాత్రి పది గంటలకు ట్రంప్‌ బృందం అమెరికాకు తిరుగుపయనం అవుతుంది.

Tags

Next Story