వెల్‌కమ్ ట్రంప్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసిన అమారావతి రైతులు
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. 71 రోజులుగా అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా అన్ని జిల్లాల్లో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. విజయవాడలో అమరావతి మహిళా JAC ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. చల్లపల్లి బంగ్లా నుంచి SRR కాలేజీ వరకు ర్యాలీ కొనసాగింది. రాజధాని భూముల్లో పేదలకు భూ పంపిణీ కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ర్యాలీలో టీడీపీ, వామపక్ష నేతలు సైతం పాల్గొన్నారు. అమరావతి కోసం రాష్ట్రమంతా ఒక్కటవుతోందని నేతలు చెప్పారు. 9 నెలలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తోందని మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటామని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
అటు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మహోగ్ర రూపం దాల్చుతున్నాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు గ్రామాలు నిరసనలతో హెరెత్తుతున్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యమం ఆగదని మహిళలు, రైతులు స్పష్టం చేస్తున్నారు.
సేవ్ అమరావతి అని నినదిస్తున్న రాజధాని రైతులు.. రోజుకో రూపంలో ఆందోళనలు చేపడున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వెల్‌కమ్ ట్రంప్ అని స్వాగతం పలుకుతూ.. తమ బాధలు తెలిసేలా చేయాలని కోరారు.
ఈ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని రైతులు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే వాటిని పేదవాళ్లకు ఎలా ఇస్తారని 29 గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. కానీ రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com