ఢిల్లీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

ఢిల్లీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక అల్లర్లు హింసాత్మకంగా మారాయి. గత రెండ్రోజులుగా జరుగుతున్న అల్లర్లలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. మరో 150 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు ఆస్తులను ధ్వంసం చేశాయి. వాహనాలను దగ్ధం చేశాయి.రాళ్లదాడిలో ఇప్పటికే ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా..డీసీపీ అమిత్ శర్మ, ఒక ఏసీపీ, ఇద్దరు జవాన్లు సహా 40 మంది పోలీసులకు గాయాలయ్యాయి. కాసేపట్లో హెడ్‌కానిస్టేబుల్ అంతిమ యాత్ర జరగనుంది. అటు, వరుసగా రెండు రోజుల పాటు ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో వణికిపోయింది. ఇప్పటికీ రాజధానిలో అనేక ప్రాంతాలు భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్తున్నా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం కనిపిస్తోంది.

అల్లరిమూకలు బకెట్లు, ట్రేలలో రాళ్లను తీసుకొచ్చి మరీ రెచ్చిపోయాయి. పోలీసులపై కూడా రాళ్లవర్షం కురిపించారు. పోలీసులు లాఠీచార్జీ చేయటంతో పాటు బాష్పవాయువు ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. జఫ్రాబాద్, మౌజ్‌పూర్, బాబర్‌పూర్‌, బ్రహ్మపురి, చాంద్‌పూర్, కార్వాల్‌నగర్‌లలో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులు విడతలవారీగా హింసాత్మక ఘటనలకు తెగబడ్డారు. పోలీసులు, సామాన్య ప్రజలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు.

అల్లర్లు నియంత్రణలోకి రాకపోడవంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. వీడియో ఫూటేజ్ ఆధారంగా అల్లర్లకు పాల్పడుతున్న వారిని గుర్తిస్తున్నారు. తుపాకీతో బెదిరించిన షారూక్‌ అనే వ్యక్తిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. యమునా విహార్‌ వంటి ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వ్యులు జారీ చేశారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ను చక్కదిద్దేందుకు స్పెషల్ కమిషనర్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవను అపాయింట్ చేశారు. అల్లర్లను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story