చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ పిలుపు.. సర్వత్రా ఉత్కంఠ
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తరువాత.. తొలిసారిగా చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. వైజాగ్‌లో జరిగిన భూ కుంభకోణంపై పూర్తి వివరాలు బయటపెడతానంటు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ భావిస్తోంది. దీనికి తోడు పోలీసులు చంద్రబాబు పర్యటనకు రూట్ క్లియర్ చేయకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ఆంక్షలు ఉన్నా పర్యటనను విజయవంతం చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో చంద్రబాబు టూరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా చంద్రబాబు విశాఖ పర్యటనను భగ్నం చేసేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయంలోనే నిరసన వ్యక్తంచేసేందుకు కార్యకర్తలను భారీగా సమీకరిస్తోంది. చంద్రబాబు గురువారం, శుక్రవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించడానికి వస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి.. అటు నుంచి పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులైన రైతులను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లనున్నారు. పనిలో పనిగా అక్కడికి సమీపంలోనే ఉన్న రాంపురం గ్రామానికి వెళ్లి.. అధికార పార్టీ నాయకుడి కుటుంబం ఆక్రమించినట్లు ప్రచారం జరుగుతున్న వీర్రాజు చెరువును కూడా సందర్శించనున్నారు. అయితే చంద్రబాబు అక్కడకు వెళ్లకుండా అర కిలోమీటరు ముందు రోడ్డును రాత్రికి రాత్రి అడ్డంగా తవ్వేశారు. ఇది అధికార పార్టీ నాయకుల పనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
విశాఖలో రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ.. ఆయన పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారని మంత్రి అవంతి ప్రశ్నించారు. ఇక్కడ ఆయన్ను అడ్డుకోకపోతే.. తిరిగి అమరావతికి వెళ్లి.. విశాఖలో అంతా రాజధానిని వద్దంటున్నారని ప్రచారం చేస్తారని, అలాంటి మాటలు ఆయన చెప్పకుండా ఉండాలంటే ఆయన రాకను అంతా వ్యతిరేకించాలని పార్టీ వర్గాలకు పిలుపు ఇచ్చారు.
చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు స్వయంగా మంత్రే పిలుపు ఇవ్వడం, అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులు విశాఖ పోలీసు కమిషనర్ ఆర్‌కే మీనాను రాత్రి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు దగ్గర పరిమితంగా మాత్రమే నేతలను అనుమతిస్తామని, విమానాశ్రయంలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. ఎయిర్‌పోర్టు నుంచి చంద్రబాబు వెనుక పార్టీ నేతల కాన్వాయ్ తప్ప మరే వాహనాన్నీ అనుమతించేది లేదని చెప్పారు. వైసీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్టుకు వస్తున్నట్లు సమాచారం ఉందని.. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున.. టీడీపీ నేతలు తక్కువ సంఖ్యలో రావాలని కమిషనర్ సూచించారు. చంద్రబాబు వెంట 50 మందికి మించకుండాలా చూసుకోవాలంటూ షరుతులు విధించారు.. పోలీసులు, ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com