ఉత్తరాంధ్రలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర
ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయన పర్యటనకు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినా పర్యటనను విజయవంతం చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో చంద్రబాబు టూరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల్లో గురువారం నుంచి పర్యటించనున్నారు. పెందుర్తి మండలం పినగాడి గ్రామంలోని ఇటీవల వివాదాస్పదంగా మారిని పెంట చెరువు అక్రమణల ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు.
అయితే ఇప్పటి వరకు విశాఖ పోలీసులు రూట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎయిర్ పోర్టు నుంచి పినగాడి ల్యాండ్ పూలింగ్ బాధితులను పరామర్శించి.. పెందుర్తి మీదుగా మంగళపాలెం, విజయనగరం జిల్లాలో ప్రవేశించిందుకు పోలీస్ ఉన్నతాధికారులు రూట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు పర్యటనను పూర్తి చేస్తామంటున్నాయి టీడీపీ శ్రేణులు. పెందుర్తి నుంచి రామ్‌పురం జంక్షన్‌కు వెళ్లి ల్యాండ్ పూలింగ్ రైతులతో ముఖాముఖీ చర్చిస్తారు.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మధ్యాహ్నం విజయనగరం జిల్లాకు చేరుకుంటారు. శృంగవరపు కోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త వలస మండలం చింతలపాలెం దగ్గర విజయనగరంలో ప్రవేశిస్తారు. చింతలపాలెం నుంచి కొత్త వలస వరకు టీడీపీ శ్రేణులు నిర్వహించనున్న ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొంటారు. కొత్త వలస కూడలిలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఎస్ కోటలోని దేవిబొమ్మ కూడలి దగ్గరకు చేరుకొని.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎస్ కోట బహిరంగ సభ ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు గంట్యాడ మండలం తాడిపూడిలో భోజన విరామం తీసుకుంటారు. 4 గంటలకు గంట్యాడ మండలం కొటారుబిల్లి కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ ముగింపు తరువాత 6 గంటలకు విజయనగరం చేరుకుంటారు. అక్కడ మొదటగా కలెక్టరేట్ కూడలిలో ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పిస్తారు. ప్రధాన రహదారి కణపాక కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తురు. సభ ముగింపు తరువాత రోడ్డు మార్గంలో విశాఖ బయలుదేరుతారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటిస్తే అడ్డుకుంటున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్న వైసీపీకి.. చంద్రబాబు పర్యటన మింగుడుపడటం లేదు.. ఉత్తరాంధ్ర వాసులు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇస్తోంది. విజయనగరంలో పర్యటించనున్న చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. ప్రజా చైతన్య యాత్ర తర్వాత టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు కూడ ఉండరని జోష్యం చెప్పారాయన. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని టీడీపీ శ్రేణులు చెబుతుంటే.. అటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com