జగన్ దూకుడుకు మోకాలడ్డిన ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డింది న్యాయస్థానం. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టింది. అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తరలింపుపై దాఖలైన పిటిషన్లను ఒక బ్యాచ్‌గా, రాజధాని విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను మరో బ్యాచ్‌గా వాదనలు వినాలని త్రిసభ్య ధర్మసనం నిర్ణయించింది.
హైకోర్టుకు సంబంధించిన కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. స్థలం లేకనే కార్యాలయాలను తరలించాల్సి వస్తోందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఉమ్మడి హైకోర్టుని అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలి కి షిఫ్టింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చిన అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. 2015లో ఉమ్మడి హైకోర్టు తీర్పు చెబుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపుపై ఇరువర్గాల వారు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మార్చ్ 17కు వాయిదా వేసిది.
అటు CRDA బిల్లు రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ రాజధాని రైతులు వేసిన పిటిషన్లపైనా విచారణ జరిగింది. సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులు, కమిటీలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరవు న్యాయవాది అశోక్ బాన్ హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. కమిటీల నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 30కివాయిదా వేసింది.
CRDA పరిధిలో పేదలకు భూ కేటాయింపుపై జారీ చేసిన 107 జీవోనూ సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లపైనా హైకోర్టు విచారణ జరిపింది. రాజధాని పరిధిలో లేని వారికి అక్కడ భూములు ఇవ్వడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. గురువారం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com