భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి టార్చర్‌ పెట్టిన శాడిస్ట్‌ భర్త

భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి టార్చర్‌ పెట్టిన శాడిస్ట్‌ భర్త

పదిహేనేళ్ల వైవాహిక బంధాన్ని అపహాస్యం చేశాడో భర్త. భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి రోజూ తీవ్రంగా వేధించాడు. చిత్రహింసలు పెడుతూ భార్యకు నరకాన్ని చూపించాడు ఆ శాడిస్ట్‌ భర్త. తన కుటుంబమే సర్వస్వం అనుకుని బతుకుతున్న భార్యను మానసికంగా, శారీరకంగా హింసించాడు. సాటి మనిషన్న కనీస స్పృహ లేకుండా.. తల పగలగొట్టి, ఒంటిపై ఇనుప కడ్డీతో తీవ్రంగా వాతలు పెట్టాడు. ఆ దారుణాన్ని ఏకంగా మైనర్ కొడుకుతో వీడియో తీయించాడు. మనసు కలిచివేసే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది.

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన పానుగంటి శ్రీనుతో వనపర్తి పట్టణం ఎస్పీ కాలనీకి చెందిన మంజుల వివాహం పదిహేనేళ్ల ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి కొన్నాళ్లుగా నార్సింగిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలె భార్యపై అనుమానం పెంచుకున్న శీను.. ఆమెను రోజూ టార్చర్‌ చేసేవాడు. రెండు రోజుల క్రితం ఆమె తల పగలగొట్టాడు. కనీస కనికరం లేకుండా వివస్త్రను చేసి శరీరంపై ఇనుప కడ్డీతో వాతలు పెట్టాడు. మరీ దారుణంగా ఆ కర్కశత్వాన్ని 14 ఏళ్ల కుమారుడితో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. చివరగా తలపై మళ్లీ బలంగా కొట్టడంతో మాడు పగిలి రక్తం ధార కట్టింది.

శాడిస్టు భర్త చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. వనపర్తి పోలీసులను ఆశ్రయించింది. వారు ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి తల్లిని దారుణంగా హింసించాడని చెప్పాడు మైనర్‌ కొడుకు.

Tags

Read MoreRead Less
Next Story