తాళం వేసిన ఇంట్లో 8 నెలల నుంచి ఒంటరిగా గడుపుతున్న వృద్ధురాలు

తాళం వేసిన ఇంట్లో 8 నెలల నుంచి ఒంటరిగా గడుపుతున్న వృద్ధురాలు

ఏడు పదుల వయసు దాటిన పండు ముసలి ఆమె.. భర్త ఏమయ్యాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు.. అసలు వస్తాడో రాడో కూడా ఎలాంటి సమాచారం లేదు. అలాంటి పరిస్థితుల్లో.. తాళం వేసిన ఇంట్లో ఏకంగా 8 నెలలుగా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కాలం గడుపుతోంది ఆ వృద్ధురాలు. ఆ ఇంట్లో ఆహారం లేదు.. కరెంటు లేదు. ఉన్న దుస్తుల్నే ఓపిక చేసుకుని ఉతుక్కోవాలి. ఎంతటి బండరాయి లాంటి హృదయమున్న వారికైనా కంటతడిపెట్టే ఈ ఘటన.. ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ గణేష్‌ నగర్‌లో వెలుగుచూసింది.

8 నెలలుగా ఇంటికిరాని భర్త కోసం ఎదురుచూస్తున్న ఈ వృద్ధురాలి పేరు బేబి. ఆమె భర్త పేరు గంగాధర్‌.. కృష్ణా జిల్లా నాగాయలంక VROగా పనిచేసి రిటైర్డ్ అయిన తనకు పిల్లలు లేరని.. హౌస్‌ ఓనర్‌కి చెప్పి అద్దెకు దిగారు. అప్పటి నుంచి గంగాధర్‌ ఎప్పుడు ఊరెళ్లినా బయటి నుంచి తాళం వేసి వెళ్లేవాడు. ఒక్కోసారి రెండు, మూడు రోజులకు వచ్చేవాడు. ఈ టైమ్‌లో ఇంటి యజమానురాలే... బేబీని పలకరించేది. కానీ ఈ సారి..గత ఏడాది జులైలో వెళ్లిన భర్త ఇప్పటికీ తిరిగిరాలేదు. భర్త చాలా రోజులుగా ఇంటికి రాలేదన్న విషయాన్ని కూడా.. ఆ వృద్ధురాలు మాటల్లో చెప్పలేకపోతోంది.

ఓ నెల అద్దె ఆలస్యమైతేనే.. కసురుకునే ఓనర్లున్న ఈ రోజుల్లో.. గత 8 నెలలుగా.. ఆ వృద్ధురాలికి ఇంటి ఓనరే రోజూ ఓ ముద్ద పెడుతోంది. ఓ సారి ఫోన్‌ చేసి త్వరలో వస్తానని గంగాధర్‌ చెప్పినట్టు హౌస్‌ ఓనర్‌ తెలిపింది. ఆ తర్వాత మళ్లీ సమాచారం లేదని చెప్పింది.

వృద్ధురాలి అవస్థ తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అక్కడికి చేరుకుని ఆమెను విముక్తి కల్పించారు. పోలీసుల సహకారంతో.. ముషీరాబాద్‌లోని వృద్ధాశ్రమానికి తరలించారు.

Tags

Next Story