త్వరలోనే ముగిసిపోనున్న 2 వేల రూపాయల నోటు కథ?

త్వరలోనే ముగిసిపోనున్న 2 వేల రూపాయల నోటు కథ?

2 వేల రూపాయల నోటు.. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.. బ్యాంకులు, ఏటీఎంలలో ఎక్కడా 2 వేల రూపాయల నోటు జాడే లేదు. ఇంతకీ 2 వేల రూపాయల నోటు ఎందుకు కనిపించడం లేదు..? బ్యాంకులే దాచేస్తున్నాయా..? లేకపోతే ప్రభుత్వమే ఆపేయ మని చెప్పిందా..? లేదా ఇద్దరూ కలిసి 2 వేల నోటుకు టెండర్ పెడుతున్నా రా..? ప్రశ్నలు, జవాబులు ఏమైనప్పటికీ 2 వేల రూపాయల నోటు ఆయుష్షు మాత్రం తీరినట్లే. ఎందుకంటే,. ఏటీఎంలలో 2 వేల నోట్లను పెట్టవద్దని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు మార్చ్ నెల నుంచి 2 వేల నోట్లను ఆపేయనున్నాయి. మార్చ్ 1 నుంచి తమ ఏటీఎంలలో 2 వేల నోట్లను పూర్తిగా ఆపేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.

సాధారణంగా ఏటీఎంలలో నాలుగు క్యాసెట్స్ ఉంటాయి. ఏటీఎంలో నోట్లు పెట్టే భాగాన్ని క్యాసెట్ అంటారు. 2016 డిసెంబర్ వరకు 4 క్యాసెట్లలో వంద, 5 వందలు, వెయ్యి రూపాయల నోట్లు పెట్టేవాళ్లు. 2 వేల రూపాయల నోట్లు వచ్చిన తర్వాత క్యాసెట్లను కొద్దిగా మార్చారు. వంద, 200, 500, 2 వేల నోట్ల పెడుతూ వచ్చారు. ఇప్పుడు 2 వేల రూపాయల కథ కూడా ముగిసిపోతుండడంతో క్యాసెట్లలో పెట్టే డబ్బుల పద్దతిని మార్చారు. మూడు క్యాసెట్లలో 500 నోట్లు ఉంచి, 2 వేల రూపాయల నోట్లు ఉంచే క్యాసెట్‌లో వంద లేదా 200 నోట్లు ఉంచాలని బ్యాంకులు నిర్ణయించాయి. చాలా బ్యాంకులు ఇప్పటికే ఈ పని పూర్తి చేశాయి. మిగతా బ్యాంకులు కూడా మరికొన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయనున్నాయి.

ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ 2 వేల రూపాయల నోటు కనిపించడం లేదు. ఆ నోటు వచ్చిన కొత్తలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొత్తరకం నోటును చూసి చాలా మంది ముచ్చటపడ్డారు. ఇప్పుడేమో అసలు కంటికే కనిపించకుండా పోతోంది. బ్యాంకుల్లోనూ 2 వేల రూపాయల నోట్లు ఇవ్వడం లేదు. ఆర్బీఐ కూడా 2 వేల నోట్లను ముద్రించడం లేదు. 2019-2020 మధ్య ఒక్కటంటే ఒక్క 2 వేల రూపా యల నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఫలితంగా దేశంలో 2 వేల నోట్ల చలామణి పూర్తిగా పడిపోతోంది.

వాస్తవానికి 2 వేల రూపాయల నోట్ల రద్దు గురించి 2017 నుంచి వార్తలు వస్తున్నాయి. ఐతే కేంద్రప్రభుత్వం, ఆర్బీఐలు ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండించాయి. అలా ఖండిస్తూనే తెరవెనక పని చేసు కుంటూ పోయాయి. ప్రజలకు పెద్దగా అనుమానం రాకుండా 2 వేల నోట్లను చలామణి నుంచి తప్పించారు. అసలు ప్రింట్ చేయడమే ఆపేశారు. ఇక రేపో మాపో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి టీవీల ముందుకు వచ్చి మేరే ప్యారీ దేశ్ వాసియో అంటూ 2 వేల రూపాయల నోట్ల రద్దు కబురు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

సరే, ఇదంతా బాగానే ఉంది గానీ, ఇంతకీ 2 వేల నోట్లను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నట్లు..? ప్రభుత్వమే తీసుకువచ్చి మళ్లీ ప్రభుత్వమే ఎందుకు ఆపేస్తోందీ..? ఎందుకంటే, ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఉండకూడదనేది నవీన ఆర్థిక సూత్రం. ఎక్కువ వాల్యూ ఉన్న నోట్లతో బ్యాక్‌మనీ పెరిగిపోతుంది. అందుకని 2 వేల రూపాయల నోట్లు చలామణీలో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం పైగా, నకిలీ 2 వేల రూపాయల నోట్ల తయారీ కూడా పెరిగిపోతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో చిన్నపాటి కర్మాగారాలే నడుస్తున్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఫేక్ నోట్ల తయారీపై మోదీ సర్కారుకు పక్కా సమాచారం ఉంది. అందుకే 2 వేల నోట్లకు కామ్‌గా టెండర్ పెట్టేస్తున్నారు. మొత్తానికి టక్కున ప్రత్యక్షమై, ప్రజలందరిని మురిపించిన 2 వేల రూపాయల నోటు కథ త్వరలోనే ముగిసిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story