ఢిల్లీ అల్లర్లపై విచారణ వేగవంతం చేస్తున్న అధికారులు
CAA ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రజలకు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పోలీసుల సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈ అల్లర్ల కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 250 మంది గాయపడ్డారు. దీనిపై ఎంక్వైరీ వేగవంతం చేసినట్లు దర్యాప్తు సంస్థ సిట్ తెలిపింది. అల్లర్లకు గల కారణాలను, అల్లర్ల కారకులకు సంబంధించిన కూపీ లాగుతున్నట్లు, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నిందితులు తమ అదుపులో ఉన్నారని వారి నుంచి తుపాకీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ వారిపై గతంలో జరిగిన పలు నేరాల్లో నిందుతులని చెప్పారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారణం మారణాయుధాల సరఫరా అని సిట్ అనుమానం వ్యక్తం చేసింది. తమ ప్రాథమిక అంచనాల ఆధారంగా విచారణ చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలోని జఫరాబాద్ ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ పర్యటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన ఆమె అక్కడి మహిళలతో మాట్లాడారు. ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు.
అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. IPS అధికారి SN శ్రీవాస్తవను ఢిల్లీకి కొత్త కమిషనర్‌గా నియమించారు. ఈయన మార్చి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ శనివారం రిటైర్ కాబోతుండటంతో.. కొత్త పోలీస్ కమిషనర్‌ను నియమించారు. ప్రస్తుతం శ్రీవాస్తవ CRPF శాంతిభధ్రతల విభాగంలో పనిచేస్తున్నారు.
ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని.. అనవసర వదంతులను ఎవరూ నమ్మవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీలో నేడు 10 గంటల పాటు కఠిన చట్టాల్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అల్లర్ల నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దుల్లో భారీ సాయుధ పోలీసుబలగాలను మోహరించారు. ఘజియాబాద్ మసీదుల్లో జుమ్మా ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా యూపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘజియాబాద్ నగరాన్ని 18 సెక్టార్లు, 56 జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో గస్తీ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు.
ఢిల్లీ ఘటనలపై అగ్ర రాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అన్ని పార్టీలను కోరింది. ఈ మేరకు US బ్యూరో ఆఫ్ సౌత్, సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ ట్విట్టర్‌లో స్పందించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com