పీపీఏల విషయంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్షపై కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. గత ప్రభుత్వంలో కుదర్చుకున్న ఒప్పందాలను మళ్లీ రివ్యూ చేసి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చే ఈ విధానంతో అంతర్జాతీయ కాంట్రాక్ట్ కంపెనీలు సైతం నష్టపోయే ప్రమాదంలో పడిపోయాయి. దీంతో అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదాలు ఏర్పడ్డాయి. అంటే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రభావం చూపుతోంది. పీపీఏలను పునఃసమీక్షించాలనే నిర్ణయం తీసుకోగానే కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. పీపీఏల సమీక్ష మంచిది కాదంటూ.. ఏపీ సీఎస్ కు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి గతంలోనే లేఖ రాశారు.
కేంద్ర ఇంధన శాఖ లేఖ రాసిన కొద్ది రోజులకే జపాన్ కంపెనీ కూడా పీపీఏ సమీక్షలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. విద్యుత్ పీపీఏలను పున:సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్ తెలిపింది. ఇప్పటికే మనుగడలో ఉన్న విద్యుత్ పీపీఏల జోలికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించింది. పలు కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించాయి.
ఇప్పుడు మరోసారి కేంద్రం ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని కీలకశాఖలో ఉన్న పీయూష్ గోయల్..ఏపీ పేరును ప్రస్తావించకుండానే పీపీఏల పునఃసమీక్షపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై నెలకొన్న ప్రతిష్టంభనల కారణంగా భారత విశ్వసనీయత తీవ్రస్థాయిలో దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా.. కాంట్రాక్టులు గానీ, వాటికి సంబంధించిన.. నిబంధనలు గానీ మారకుండా ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఓ చట్టబద్ధమైన నియమావళిని రూపొందించాల్సిన అవసరముందని పీయూష్ గోయల్ అన్నారు.
దావోస్‌లో జరిగిన సదస్సుకు హజరైన కేంద్రమంత్రి గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీపీఏల వ్యవహారంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాలి కానీ దేశం పరువు తీస్తే ఎలా..? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. సీఐఐ లాంటి సంస్థలు పరిష్కారం సూచించాలని కూడా కేంద్రమంత్రి గోయల్ కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com