పావురం దెబ్బకు పరుగులు పెట్టిన 50 ఇళ్లలోని ప్రజలు

పావురం దెబ్బకు పరుగులు పెట్టిన 50 ఇళ్లలోని ప్రజలు
X

ఒక పావురం దెబ్బకు 50 ఇళ్లలోని జనం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒక్కసారిగా స్విచ్ బోర్డుల్లో మంటలు చెలరేగటంతో ఏం చేయాలో తోచక భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉన్నట్టుండి చెలరేగిన మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. స్విచ్‌ బోర్డు మంటల నుంచి తేరుకొని చూసుకున్న జనాలకు మరో షాక్‌ తగిలినట్లైంది. ఇంట్లోని ఎలక్ట్రిక్‌ సామాగ్రి మొత్తం పాడైపోయాయి. ఫ్రిజ్‌, ఫ్యాన్లు, ఇన్వర్టర్లు కాలిపోయాయి. 50 ఇళ్లలో ఇదే పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఓ పావురం.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఈ ఘటన. కృష్ణవేణి చౌక్‌ నుంచి నది అగ్రహారం వెళ్లేదారిలో పాత హౌసింగ్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలేంతగా ఊగుతున్నాయి. అయితే..ఓ పావురం వైర్లపై వాలటంతో వైర్లు ఒకదానికొకటి తగిలాయి. ఆ పావురం చనిపోయింది. వైర్లు తాకటంతో మంటలు చెలరేగాయి. దాదాపు 50 ఇళ్లలోని మీటర్లతో సహా ఎలక్ట్రిక్ గూడ్స్‌ పాడైపోయాయి.

ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూలు కూడా ఉంది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు స్థానికులు. ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యంతో గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

Tags

Next Story