భారత్ పర్యటన విశేషాలు గుర్తు చేసుకుంటూ.. సొంత వాయిస్‌తో వీడియో పెట్టిన ట్రంప్

భారత్ పర్యటన విశేషాలు గుర్తు చేసుకుంటూ.. సొంత వాయిస్‌తో వీడియో పెట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లు.. భారత పర్యటన స్మృతులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. పర్యటన ఆధ్యంతం అద్భుతంగా సాగిదంటూ వరుస ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. ఆ స్మృతులను నెమరవేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన పర్యటన విశేషాలను వివరిస్తూ.. తన స్పీచ్‌పై వీడియోను పెట్టి.. ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్‌ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు.

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గొన్న నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని.. 1,169 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్‌సీ సమాచారమిచ్చింది.

ఇటు ట్రంప్‌ భార్య.. అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్‌ సైతం భారత స్మృతులను నెమరవేసుకుంటున్నారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్‌ క్లాస్‌ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా వర్ణిస్తూ ట్వీట్‌ చేశారు. తనకు స్కూల్‌లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story