దేశ ఆర్థిక రాజధానిని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు : ఐబీ

దేశ ఆర్థిక రాజధానిని టెర్రరిస్టులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబైలో ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడవచ్చని వార్నింగ్ ఇచ్చాయి. భయంకరమైన దాడులకు ముష్కర మూకలు కుట్ర పన్నాయని సమాచారం అందించాయి. ఆ సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ముంబైలో చిన్న చిన్న విమానాలు, డ్రోన్లను నిషేధించారు. పారాగ్లైడర్లు, బెలూన్లు, క్రాకర్లు, పతంగులు, లేజర్ లైట్లపైనా ఆంక్షలు పెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. మార్చి 24 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని ముంబై పోలీసులు తెలిపారు.
ఇక, ఐబీ హెచ్చరికలతో ముంబై పరిసరాల్లో నిఘా పెంచారు. నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. 1993, 2008 మారణకాండల నేపథ్యంలో ముంబైలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదులు వాయు మార్గాల్లో దాడులు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com