ఇల్లందులో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ పర్యటన

ఇల్లందులో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ వ్యాప్తంగా పట్టణాల రూపురేఖలు మార్చే విధంగా ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మం, ఇల్లందు ప్రాంతాల్లో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ పర్యటన సాగనుంది. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, బాస్కెట్ బాల్ ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్‌లు, మినీ ట్యాంక్ బండ్‌ను ఆయన ప్రారంభిస్తారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కేసీఆర్ డిగ్నిటీ హోమ్స్ పేరుతో నిర్మించిన 300 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రజలకు అందజేస్తారు.

అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు కేటీఆర్‌. ఆ తర్వాత ఇల్లందులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పట్టణ ప్రగతిపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగేందుకు కేటీఆర్ పర్యటన దోహదపడుతుందంటున్నారు ప్రజాప్రతినిధులు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షించారు.

కేటీఆర్ పర్యటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టణ ప్రగతి మరింత జోరందుకుంటుందని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా… కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టామని, చెత్తా చెదారం తొలగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. పబ్లిక్ టాయిలెట్లు, పార్కుల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రజలంతా పెద్దెత్తున మొక్కలు నాటాలని ఆయన కోరారు.

కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి రాకతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్టాణాలకు కొత్త కళ వస్తుందంటున్నారు నేతలు. కేటీఆర్ టూర్‌ను దిగ్విజయం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

Tags

Next Story