పాత పరిచయం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

పాత పరిచయం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

చదువుకునే సమయంలో మిత్రుడని మాట్లాడితే అతి చనువు చూపాడు. చివరకు అదే రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఇద్దరు మృతికి కారణమైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడు శవమై తేలగా.. మహబూబ్‌ నగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

గద్వాలకు చెందిన సుధారాణికి 2011లో ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో పాత పరిచయం చిచ్చుపెట్టింది. గతంలో గద్వాలలో కార్తీక్ అనే యువకుడు సుధారాణితో పాటు డిగ్రీ చదువుకున్నాడు. తర్వాత మళ్లీ ఫేస్‌బుక్‌లో స్నేహం పేరుతో ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు. కొద్దిరోజులు స్నేహంగా మెలిగిన సుధారాణి అతని ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసింది.

అప్పటి నుంచి సుధారాణి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు కార్తీక్. ఈ నేపథ్యంలో అతడు ఈనెల 24 నుంచి కనిపించకుండాపోయాడు. దీనిపై అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిగ్రీలో వారితో కలిసి చదువుకున్న రవి, మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు కార్తీక్ ను హత్య చేసినట్లు ఆంగీకరించాడు. అంతేకాదు, హత్య చేసిన రవి.. ఆ విషయాన్ని సుధారాణికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఇకపై కార్తీక్ నుంచి నీకు ఎలాంటి వేధింపులు వుండవని.. కార్తీక్ ను హత్య చేసినట్టు సుధారాణితో చెప్పాడని తెలుస్తోంది.

కార్తీక్ హత్యతో.. సుధారాణి ఆందోళనకు గురైంది. పోలీసుల విచారణలో ఎక్కడ తన పేరు బయటకు వస్తుందోనని భయపడి వెంటనే ఆత్మహత్య చేసుకుంది. నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో తన తప్పు లేదని.. స్నేహం ముసుగులో కార్తీక్ తనను ఇబ్బంది పెట్టేవాడని తెలిపింది. తన చావుకు కార్తీకే కారణమని.. అతడి హత్యతో కుటుంబం పరువుపొతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో స్పష్టం చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు, భర్తకు ఫోన్‌ చేసి.. ఇంట్లో ఉరేసుకొంది.

ఇదిలావుంటే, మహబూబ్‌నగర్‌ వెళ్లిన తమ కుమారుడు తిరిగి రాలేదని, అతను సుధారాణి అనే అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని కార్తీక్‌ తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్తీక్ గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండాపోయినా.. తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టలేదు. దీంతో పోలీసులే నేరుగా ఇంటికి మిసింగ్ కేసు నమోదు చేయించారు. దీంతో తమ అబ్బాయి కనిపించకుండాపోయిన విషయం పోలీసులకు ఎలా తెలిసిందని.. ఈ హత్య వెనక చాలా మంది వున్నారని కార్తీక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story