76 వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

76 వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 76 వ రోజుకు చేరింది. ఉద్యమం రోజురోజుకు మహోగ్రంగా సాగుతోంది. 29 గ్రామాలు ఒక్కటిగా ఉద్యమిస్తున్నాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆగదన్నారు రైతులు. మందడంలో రహదారిపైనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే కూర్చొని భోజనం చేసి నిరసన తెలిపారు.

రాజధాని గ్రామాల్లో ఎటు చూసినా సేవ్‌ అమరావతి నినాదాలే! తుళ్లూరు, మందడం, యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డరోడులో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. జలదీక్షలు, రహదారిపై వంటవార్పులు, ర్యాలీలు, ధర్నాలు ఆగడం లేదు. మీ స్వార్ధ రాజకీయ కోసం తమ భవిష్యత్‌ను నట్టేట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు.

ఉద్యమం 76 రోజులకు చేరినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రావడం లేదు. పైగా 3 రాజధానుల నిర్ణయాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. రైతులు మాత్రం రాజధానిని అమరావతి నుంచి మారిస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటున్నారు.

Tags

Next Story