తెలంగాణకు పెద్దపులుల వలస తాకిడి

తెలంగాణకు పెద్దపులుల వలస తాకిడి

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలోని తడోబా-అంథేరీ రిజర్వ్‌ నుంచి రెండు పెద్ద పులులు తెలంగాణ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో కాగజ్‌నగర్‌, మంచిర్యాల, చెన్నూరు డివిజన్‌ పరిధిలోని ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ప్రాణహిత నదికి ఆవల మహారాష్ట్ర తడోబా- అంథేరి టైగర్‌ రిజర్వ్‌ ఉన్నది. దాదాపు 17వందల 27 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన తడోబా అభయారణ్యం పులులకు పుట్టినిల్లుగా విలసిల్లుతున్నది. అక్కడ పులుల సంఖ్య 80 దాటినట్లు తాజా గణనలో తేలింది. 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న తిప్పేశ్వర్‌లో వీటి ఆవాసానికి సరిపడ స్థలం లేక ఆదిలాబాద్‌, జైనథ్‌ వైపునకు పరుగులు తీస్తున్నా యి. దాదాపు రెండువేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న కవ్వాల్‌ అభయారణ్యం 2005 నుంచే పులులకు అభయహస్తం అందిస్తున్నది. పెద్దపులుల వలస క్రమంగా పెరుగుతున్నది. గతంలో నాలుగే ఉండగా తాజాగా వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో విస్తరించిన కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో అటవీశాఖ అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రతి పులి అడుగును ఎప్పటికప్పుడు సేకరించి ప్రజలకు ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులో పులులు పడకుండా, జనావాసాల్లో పంజా విసరకుండా రాష్ట్ర అటవీశాఖ అసాధారణ ఏర్పాట్లను చేస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఇంద్రావతి మొదలుకొని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వరకు రెండు కారిడార్లలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఇప్పటికే పలుసార్లు టైగర్‌ అలర్ట్‌లను జారీచేసింది. కవ్వాల్‌ అభయారణ్యంలోకి పెద్దపులుల తాకిడి పెరుగుతున్నట్టు కెమెరా ట్రాప్‌లలో నమోదైన దృశ్యాల ద్వారా తెలుస్తున్నది.

ఈ పులులు జనావాసాల వైపు వెళ్లకుండా, స్థానికులు అభయారణ్యంలోకి వచ్చి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు అధికారులు. ప్రతి కిలోమీటర్‌కు ఒక వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటుచేసి పులులకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆహార కొరతతో తలెత్తకుండా హైదరాబాద్‌ జూపార్క్‌, హరిణ వనస్థలి, చిలుకూరు మృగవణి వంటి జాతీయపార్కుల నుంచి ఆహారం పంపిస్తున్నారు. టైగర్‌ కారిడార్లలో గస్తీని ముమ్మరం చేశారు.

యుక్త వయస్సు పెద్దపులులు కొత్తగా తమ సామ్రాజ్యాలను ఏర్పాటుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. తిప్పేశ్వర్‌కు చెందిన ఒక యువపులి దాదాపు రెండువేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. తిప్పేశ్వర్‌ సాంక్చువరీలో చిక్కిన ఒక యువపులికి అక్కడి అధికారులు గతేడాది ఫిబ్రవరిలో రేడియో కాలర్‌ ఏర్పాటుచేశారు. జీపీఎస్‌ ద్వారా దాని కదలికలను పసిగట్టగా అది తిప్పేశ్వర్‌ నుంచి తెలంగాణలోని కవ్వాల్‌ అభయారణ్యం మీదుగా 2వేల 100 కిలోమీటర్లకుపైగా ప్రయాణించినట్టు గుర్తించారు. మొత్తం పది జిల్లాలను దాటి మరఠ్వాడ ప్రాంతంలోని అజంత, ఎల్లోర అడవుల్లో స్థిరపడినట్టు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story